Best Teacher Nallamalli Kusuma Story : నల్లమల్లి కుసుమ ఎలాంటి బోధనాంశాలు ఉంటే పిల్లలు చదువుపై ఆసక్తి చూపుతారో స్పష్టంగా తెలిసిన టీచర్. అందుకే ఆయా అంశాలను పొందుపరుస్తూ సొంత ఖర్చులతో నోట్‌బుక్‌లు, స్టడీ మెటీరియల్స్ రూపొందిస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను, ఊహాశక్తిని పెంచుతున్నారు. పాఠాలు బట్టీపట్టడం కాదు. ఇష్టంతో చదవాలంటూ విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. విజయవాడ పటమటలోని గోవిందరాజు ధర్మ ఈనాం ట్రస్ట్ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల్లో సెకండరీ గ్రేడ్ అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న కుసుమ ఎంతోమంది జీవితాల్లో విద్యా పరిమళాలు నింపారు.
కుటుంబమంతా టీచర్లే : మచిలీపట్నానికి చెందిన కుసుమ కుటుంబమంతా టీచర్లే. తల్లి, తండ్రి, అత్తమామలు, భర్త ఇలా అందరిదీ ఉపాధ్యాయ వృత్తే. ఉపాధ్యాయురాలిగా తన తల్లి నెలకొల్పిన ప్రమాణాలు కుసుమను ఉపాధ్యాయ వృత్తి బాటపట్టించాయి. 1998లో టీటీసీ పూర్తి చేసి తాను చదివిన నిర్మల హైస్కూల్‌కే టీచర్‌గా వెళ్లారు. 2010లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల్లో కుసుమ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించారు. అప్పటి విజయవాడ మున్సిపల్ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో విద్యార్థుల కోసం 30 రోజుల క్రాష్ కోర్సు డిజైన్ చేశారు. దీంతో 2012లో మండల స్థాయిలో ఉత్తమ టీచర్‌గా అవార్డు సాధించారు.
పూజారి కాబోయి టీచర్‌గా రాధాకృష్ణన్- అమ్మలకు కూడా విష్ చేయాల్సిందే! - Teachers Day 2024
విద్యార్థుల కోసం ప్రత్యేక నమూనాలు : చిన్న చిన్న పిల్లలకు చదువు చెప్పడం అంటే ఎవరికైనా కత్తిమీద సామే . కానీ అదొక సవాల్‌గా తీసుకొన్న కుసుమ బొమ్మలు, ఫొటోలతో పిల్లలకు పాఠాలు చెబుతూ విద్యపై వారిలో ఆసక్తి పెంచుతున్నారు. ఆటలు ఆడిస్తూనే వారిలో విజ్ఞానాన్ని నింపుతున్నారు. ఇందుకోసం ఆమె ప్రత్యేక నమూనాలను సొంతంగా తయారు చేసుకున్నారు. ఆందుకే కుసుమ చెప్పే పాఠాలంటే పిల్లలకు ఎంతో ఇష్టం. రాష్ట్రస్థాయిలో రిసోర్స్ పర్సన్‌గా ఎదిగారు. ఈవీఎస్-టెక్స్ట్ బుక్‌ను, అంగన్ వాడీ చిన్నారుల కోసం బడ్స్ టెక్స్ట్ బుక్‌ను తయారు చేశారు. 6వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్ రూపకల్పనలో కుసుమ కీలక భూమిక పోషించారు.
Teachers Day Special Story 2024 : కొత్త టీచర్లకు శిక్షణ ఇచ్చారు. కొవిడ్ సమయంలో ఆన్‌లైన్ క్లాసులు తీసుకున్నారు. విద్యా రంగానికి కుసుమ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఆమెకు 2021 గోవాలోని ఆవిష్కార్ ఫౌండేషన్స్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చి సత్కరించింది. 2022లో ఎన్టీఆర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2023లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. విద్యార్థుల మదిలో నిలిచే వారే అసలైన గురువులని కుసుమ అంటున్నారు. బోధనలో వైవిధ్యం, చిన్నారులకు మంచి భవిష్యత్ అందించాలనే లక్ష్యం కుసుమ టీచర్‌ను ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నిలిపాయి. జీవితాంతం ఇదే పంథాలో నడుస్తానంటున్న ఆమె మార్గం యువతకు అనుసరణీయం.