Road Accident in Rajasthan : రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి బార్ అసోసియేషన్ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్మేర్ విహారయాత్రకు వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున జోథ్‌పూర్ టోల్‌గేట్ సమీపంలో ఆగి ఉన్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న అక్కడికక్కడే మృతిచెందారు. రాజేంద్రప్రసాద్ సహా 11 మందికి గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
జ్యోత్స్న మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం : ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్య పరిచేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన సుంకర రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అవసరమైన సాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మహిళా భద్రత, సాధికారత కోసం ఉద్యమించిన న్యాయవాది జ్యోత్స్న మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. విహారయాత్ర విషాదయాత్రగా మారడం బాధాకరమని చెప్పారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన రాజేంద్రప్రసాద్, న్యాయవాదులు త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఆకాక్షించారు.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - డ్రైవర్ మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు