Vijayawada Kanaka Durgamma Laddu Prasadam: విజయవాడ దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు అమ్మవారి దర్శనం ఎంత ముఖ్యమో అమ్మవారి నేతి లడ్డూ ప్రసాదం కూడా అంతే ముఖ్యం. భక్తులకు ప్రసాదం లోటు లేకుండా అందించాలని ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 24 గంటలూ వందల మంది సిబ్బంది ప్రసాదాల తయారిలో నిమగ్నమయ్యారు. లడ్డూ విక్రయాల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు, భక్తుల కోరినంత లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నారు.
ఈసారి ఆరు లడ్డూలను ప్రత్యేకంగా ఒక బాక్సులో ఉంచి విక్రయించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల కోసం మొత్తం 20 లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేసి భక్తులకు అందిస్తున్నారు. వన్ టౌన్ మలిఖార్జునపేటలోని దేవస్థానం ప్రసాదాల తయారీ కేంద్రంలో లడ్డూ తయారు చేసేందుకు ఏర్పాట్లు చేయగా, షిఫ్టుల వారీగా సిబ్బంది పెద్ద మొత్తంలో ప్రసాదాలను తయారుచేసి కొండపైకి అలాగే కొండదిగువున ఉన్న ప్రసాదాల కౌంటర్లకు అందిస్తున్నారు.
లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ - అమ్మవారి సేవలో సినీప్రముఖులు - Dasara Navaratri 2024
పోటు తయారీ దగ్గర నుంచి లడ్డూలను చుట్టే వరకు: వంద కేజీల పిండికి సుమారు 5 వేల 640 లడ్డూలు తయారు చేస్తున్నారు. వంద కేజీల శనగపిండిలో 2 వందల కిలోల పంచదార, 60 కిలోల నెయ్యి, ఏడున్నర కిలోల జీడి పప్పుతో పాటు 5 కిలోల కిస్మిస్, 750 గ్రాముల యాలకల పొడి, 150 గ్రాముల పచ్చ కర్పూరం కలుపుతారు. లడ్డూ ప్రసాదాన్ని 80, 400 గ్రాముల్లో రెండు రకాలుగా తయారు చేస్తున్నారు. ఈ లడ్డూ ప్రసాదాల తయారిలో సుశిక్షితులైన 250 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రసాదం పోటు తయారీ దగ్గర నుంచి లడ్డూలను చుట్టే వరకు ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
లడ్డూ పోటును తయారు చేసిన తర్వాత పెద్ద పెద్ద ప్లేట్లలో ఉంచి పంచదార పటిక ముక్కలు వేసి, ఆ తర్వాత ఉండలుగా చుట్టి ప్యాకింగ్ చేస్తున్నారు. సాధారణ కౌంటర్లలో విక్రయించే లడ్డూలు 80 గ్రాములు, ప్రత్యేకంగా పూజలు, ప్రముఖులకు ఇవ్వడానికి 4 వందల గ్రాముల లడ్డూలను సిబ్బంది సిద్దం చేస్తున్నారు.
దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్ధానం ఈ ఏడాది తొలిసారిగా లడ్డూ ప్రసాదాన్ని ఫ్యామిలి ప్యాకెజ్ రూపంలో సిద్ధం చేసింది. వంద రూపాయలకు ఆరు లడ్డూలను ఒక ఆకర్షణీయమైన బాక్స్‌లో ఉంచి భక్తులకు అందిస్తోంది. ప్రసాదాల నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా ఎప్పటికప్పుడు నాణ్యతను పరిశీలిస్తూ దుర్గగుడి అధికారులతో పాటు ఫుడ్ సేప్టీ అధికారులు లడ్డూ ప్రసాద తయారీ సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నారు. ఈ ప్రసాదాల తయారీ కౌంటర్‌ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు కోరినన్ని లడ్డూలను అందిస్తామని అన్నారు.
ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు - అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు - Devi Navaratri Celebrations Day 3