Urban Health Center Moving to Collapse in Narsipatnam : గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పనులు ఎంత నాశిరకంగా ఉన్నాయో చెప్పడానికి నర్సీపట్నంలో నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రమే ఇందుకు నిదర్శనం. కట్టిన రెండు సంవత్సరాలకే భవనం మెుత్తం పగుళ్లు ఏర్పడి శిథిలమయ్యే స్థితిలోకి చేరింది. అక్కడికి చికత్స కోసం వచ్చే రోగులు, సిబ్బంది సైతం బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో దీనిపై వైసీపీ నేతలను నిలదీస్తే, ఎదురుదాడికి దిగుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు వాపోతున్నారు. దీనిపై టీడీపీకి చెందిన కౌన్సిలర్ చింతకాయల రాజేష్, పద్మావతి ఆధ్వర్యంలో నర్సీపట్నం తెలుగుదేశం నేతలు పట్టణ ఆరోగ్య కేంద్రంలోని లోపాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం వీటిని సభాపతి అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ఉద్దానం కిడ్నీ ఆస్పత్రిలో వసతుల లేమి - నానా అవస్థలు పడుతున్న రోగులు - Uddanam Kidney Hospital
ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడూతూ, గత వైసీపీ హయాంలో సుమారు రూ. 35 లక్షల వ్యయంతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మించారని తెలిపారు. పనుల్లో నాణ్యత లోపం వల్ల నిర్మించిన రెండు సంవత్సరాలకే భవనం మెుత్తం పగుళ్లు ఏర్పడ్డాయని వెల్లడించారు. పట్టణంలోని రోగులకు, మన్యం ప్రజల ఆరోగ్య అవసరాల కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో అయ్యన్న పాత్రుడు 150 పడకల ఆసుపత్రిని నిర్మించారని గుర్తుచేశారు.
అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏరియా ఆసుపత్రి సేవలను పూర్తిగా విస్మరించి దానికి నిధులు ఇవ్వకుండా కావాలనే నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఉన్న ఆసుపత్రికి నిధులు మంజురు చేయకుండా అదనంగా మరో భవనాన్ని నిర్మించారని ఆరోపించారు. అయినప్పటికీ సేవలు విషయంలో పూర్తిగా విఫలం కావడంతో అక్కడికి వచ్చే రోగులు పెదవి విరుస్తున్నారని తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో కరెంట్ లేనప్పుడు జెనరేటన్ను నడిపెందుకు కనీసం డీజిల్ కొనుగోలు చేసేందుకు నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. దీంతో సెల్ ఫోన్ వెలుతురులోనే ఆపరేషన్లు, డెలివరీలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.
ఇన్నీ ఇబ్బందులు ఉన్న వాటిని సరి చేయకుండా వైసీపీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు స్వలాభం కోసం అవసరం లేనిచోట పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మించారని మండిపడ్డారు. ఇందుకు వెచ్చించిన నిధులు పూర్తిగా వృథా అయ్యాయని ఆరోపించారు. మరోపక్క నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో డొల్లతనం బయట పడిందని విమర్శించారు. ఈ విషయాలను అన్నింటిని పూర్తిగా అధ్యయనం చేసి సభాపతి అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.