Union Minister Kumaraswamy Visakhapatnam Tour : విశాఖ ఉక్కు భవిష్యత్‌పై మళ్లీ ఆశలు రేగుతున్నాయి. మూడు సంవత్సరాలకు పైగా ఉద్యోగుల ఆందోళన, జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి. నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు కర్మాగారానికి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఈరోజు రానున్నారు. ఉన్నతాధికారులు, కార్మిక నేతలతో గురువారం నాడు సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఏం చెబుతారు, సెయిల్‌లో విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది.
ఇటీవలే ఏపీ బీజేపీ ఎంపీలు కేంద్ర ఉక్కుమంత్రి కుమారస్వామిని కలిశారు. స్టీల్ ప్లాంట్‌పై ఇక్కడ ప్రజల ఆకాంక్షలు, ప్రైవేటీకరణ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయణ్ని కోరారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో, రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌ను విలీనం చేయడం వల్ల రెండు కంపెనీలు లాభపడతాయని వారు కుమారస్వామికి వివరించారు.
Visakha Steel Plant Issue Updates : మరోవైపు విశాఖ ఉక్కు కార్మికులు మూడు సంవత్సరాలకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వివిధ స్థాయిల్లో తమ నిరసనన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నేరుగా కొంత వర్కింగ్ క్యాపిటల్ రూపంలోనూ లేదా రుణ పరపతిలోనూ సర్దుబాటు చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా ముడి సరుకుకు సంబంధించి కొంత వెసులుబాటు ఇవ్వాలని అంటున్నారు. ఈ క్రమంలోనే సొంతంగా గనులు కేటాయింపులకు సంబధించిన పరిష్కారం కోసం, ఎన్ఎండీసీతో ప్రత్యేకంగా ఒప్పందం చేయడం వంటివి ఉక్కు కర్మాగారాన్ని లాభాల బాట పట్టిస్తాయని కార్మికులు చెబుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌కి ఇవ్వాలని కేంద్రాన్నికోరామని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు తెలిపారు. ఈ కర్మాగారాన్ని ప్రైవేట్ పరం కాకుండా చూస్తామని ఆయన హమీ ఇచ్చారని కాశీ విశ్వనాథరాజు పేర్కొన్నారు.
కష్టాల నడుమ నిర్వహణ : మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మూడేళ్లుగా 60 శాతం ఉత్పత్తే వస్తోంది. తగినంత వర్కింగ్ క్యాపిటల్ లేక రూ.15,000ల కోట్ల విలువైన యంత్రసామగ్రి నిరుపయోగంగా ఉంది. 2022 నుంచి ఒక బ్లాస్ట్‌ఫర్నేస్-3 ఆపేయడంతో రెండున్నర మిలియన్ టన్నుల ఉత్పత్తి కోల్పోయింది. విశాఖ ఉక్కుకు చెందిన రాయబరేలి ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంటును రూ.2,000ల కోట్లకు విక్రయించారు. విశాఖలో విలువైన 25 ఎకరాల స్థలాలను ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టారు. తాజాగా హైదరాబాద్, చెన్నైలోని ఉక్కు యార్డులతో పాటు, వివిధ నగరాల్లోని కార్యాలయ భవనాలను రూ.475 కోట్లకు అమ్మేందుకు ప్రతిపాదించారు.
'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు' నినాదంతో కార్మిక సంఘాల మహాపాదయాత్ర