Atal Pension Yojana: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో అటల్ పెన్షన్ యోజన (Atal Pension yojana) మొత్తాన్ని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్యారెంటీ పెన్షన్ రెట్టింపు చేసే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని కేంద్రం అంచనా వేస్తోందని సమాచారం. పథకంలో చేరేవారి వయోపరిమితి కూడా పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 40 ఏళ్లలోపు వారికి మాత్రమే అవకాశం ఉండగా 50 ఏళ్లకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
అసంఘటిత రంగం కార్మికులకు అటల్ పెన్షన్ యోజన పథకాన్ని 2015 బడ్జెట్‌లో ప్రకటించారు. ఎలాంటి పింఛన్ నోచుకోని వారికి నెలకు రూ.1000నుంచి 5వేల వరకు పెన్షన్ అందుతుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తులు ఈ పథకంలో చేరడానికి అర్హులు కాగా, అందుకు అనుగుణంగా నెలనెలా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో 6.62 కోట్ల మంది చేరగా 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 1.22 కోట్ల మంది ఈ పథకంలో చేరారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) అటల్ పెన్షన్ యోజన పథకాన్ని నిర్వహిస్తోంది. పెరిగిన జీవన వ్యయాల నేపథ్యంలో ఈ పథకం ద్వారా అందుతున్న మొత్తం భవిష్యత్ అవసరాలకు చాలవు కాబట్టి పెంచాల్సి ఉందని పీఎఫ్‌ఆర్‌డీఏ కూడా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.
- అటల్ పెన్షన్ యోజన (Atal Pension yojana) కేంద్రం అందించే కనీస నెలవారీ పెన్షన్ పథకం. చెల్లింపుల ఆధారంగా ప్రతి నెలా రూ.1000, రూ.2000, రూ.3000, రూ.4000, రూ.5000 చొప్పున అందుతుంది. ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకునే వారు భారత పౌరులై, 18 -40 సంవత్సరాల వయస్సు మధ్య వారై ఉండాలి. దరఖాస్తు సమయంలో నామినీ వివరాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలు అందించాలి. నెలవారీగా లేదంటే త్రైమాసిక, అర్ధవార్షిక (మూడు, ఆరు నెలలకోసారి) ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 ఏళ్ల లోపు వయోజనులు అటల్ పెన్షన్ స్కీమ్‌లో చేరవచ్చు. విద్యార్థులు కూడా ఈ స్కీమ్‌లో చేరి తమ భవిష్యత్తు పదవీవిరమణ జీవితం కోసం పెట్టుబడి పెట్టే వీలుంది. ప్రభుత్వ ప్రాయోజిత సామాజిక భద్రతా పథకాలను పొందుతున్న వారు, పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు.
- APY పెన్షన్ స్కీంలో చేరడానికి ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో సేవింగ్ ఖాతా కలిగి ఉండాలి. లేదంటే పోస్ట్ ఆఫీసులో కూడా పెట్టుబడి పెట్టి ఈ పథకంలో చేరే వీలుంది. ఈ స్కీమ్‌లో చేరిన వారు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద రూ. 50వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
- ప్రస్తుతం మీ వయస్సు 18 సంవత్సరాలు అనుకుంటే ఉద్యోగ విరమణ (60ఏళ్లు) రావడానికి ఇంకా 42 సంవత్సరాలు ఉంటుంది. అప్పటి వరకు రోజుకు రూ.7 చొప్పున నెలకు రూ.210 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
- 25 సంవత్సరాలకు ఈ పథకంలో చేరితే నెలవారీ రూ.376, 30 సంవత్సరాల వద్ద అయితే రూ.577, 35 ఏళ్ల వద్ద అయితే మీరు నెలవారీ రూ. 902 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ మీ వయస్సు 40 సంవత్సరాలు అయితే మరో 20 ఏళ్లపాటు నెలకు రూ.1454 పెట్టుబడిగా పెట్టాలి. చిన్న వయస్సులోనే ఈ పథకంలో చేరడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందే వీలుంది.
- చందాదారుడికి 60ఏళ్ల వయస్సు వచ్చాక పింఛన్ అందుతుంది. చెల్లించిన ప్రీమియం ఆధారంగా నెలకు రూ.1000-5వేల వరకు అందిస్తారు. చందాదారుడు మృతి చెందితే జీవిత భాగస్వామికి పింఛన్ అందుతుంది.
- చెల్లింపులతో పాటు లావాదేవీలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.
- నెలవారీ చెల్లింపులను మూడు నెలలకోసారి, ఆరునెలలకోసారి, లేదంటే ఆరునెలల చెల్లింపులను నెలవారీగా చెల్లించేలా https://www.npscra.nsdl.co.in/nsdl-forms.php లింకు ద్వారా మార్పు చేసుకునేందుకు వీలుంటుంది.
ఒకవేళ మీరు ఎస్‌బీఐ ఖాతాదారులైతే..
- ముందుగా ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
- 'ఈ-సర్వీసెస్' ఆప్షన్‌లో అందుబాటులో ఉన్న 'సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్'పై క్లిక్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ 'అటల్ పెన్షన్ యోజన'ను ఎంచుకోవాలి.
- ఏపీవై అనుసంధానించే పొదుపు ఖాతా నంబర్‌ను ఎంచుకుని సబ్మిట్ చేయాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత కస్టమర్ ఐడెంటిఫికేషన్ (సీఐఎఫ్) నంబర్‌ను సెలక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది.
- సిస్టమ్ జనరేట్ చేసిన సీఐఎఫ్ నంబర్‌ను సెలక్ట్ చేయాలి.
- స్క్రీన్‌పై కనిపించే ఈ-ఫారాన్ని నింపాలి.
- వ్యక్తిగత వివరాలను పూర్తి చేసిన తర్వాత, నామినీ వివరాలను పూర్తిచేయాలి.
- పెన్షన్ మొత్తం నెలవారీగా, త్రైమాసికంగా, వార్షికంగా.. మీకు కావలసిన కాంట్రిబ్యూషన్ పిరియడ్.. మొదలైన వివరాలు ఇవ్వాలి.
- ఫారం సబ్మిట్ చేసి, ఎక్‌నాలెడ్జ్‌మెంట్ రశీదు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రిటైర్మెంట్ ప్లాన్ - ఈ టిప్స్ పాటిస్తే 'ఎక్స్ట్రా పెన్షన్' గ్యారెంటీ! - EPFO Pension Rules
నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో కొత్త రూల్ - ఈ విషయం మీకు తెలుసా?