Boy Died Dogs Attack NTR District : రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఏ గల్లీలో చూసినా గుంపులు గుంపులుగా తిష్ట వేస్తున్నాయి. సంచులు పట్టుకుని వస్తుంటే చాలు వెంటాడుతూ పరుగెత్తిస్తున్నాయి. బైకులపై వచ్చే వాళ్లకూ భయాన్ని పుట్టిస్తున్నాయి. ఇక చిన్నపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు దాడులకు తెగబడిపోతున్నాయి. రాత్రి వేళ్లల్లోనైతే పట్టాపగ్గాలే ఉండవు. గల్లీల్లో దర్జాగా గర్జిస్తూ వీధి శునకాలు దౌర్జన్యం చేస్తున్నాయి.
కుక్కల భయంతో ఇంట్లో నుంచి అడుగు తీసి బయటపెట్టాలంటే చాలు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే శునకాల దాడిలో పలువురు మృత్యువాత పడ్డారు. తాజాగా ఆ దంపతులకు వివాహమై 12 సంవత్సరాలు అయినా సంతానం కలగలేదు. పన్నెండేళ్లకు ఓ కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డను అపూరూపంగా పెంచసాగారు. కానీ వారిని చూసి విధికి కన్ను కుట్టిందేమో వీధి కుక్కల రూపంలో ఆ బాలుడిని బలి తీసుకుంది. ఈ హఠాత్ పరిణామంతో ఆ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఈ విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
Penuganchiprolu Boy Dies Dog Attack : ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పెనుగంచిప్రోలులోని స్థానిక తుపాన్ కాలనీలో ఉండే బాలతోటి గోపాలరావు, నాగమణి దంపతులకు ప్రేమ్‌కుమార్(2) ఏకైక సంతానం. సోమవారం ఇంటి బయట స్నానం చేయించేందుకు తల్లి కుమారుడిని బయటకు తీసుకొచ్చింది. బిడ్డను అక్కడే ఉంచి ఏదో పని మీద ఆమె ఇంట్లోకి వెళ్లింది. అంతలో అక్కడకు వచ్చిన కుక్కలు హఠాత్తుగా బాలుడిపై దాడి చేసి నోట కరచుకుని లాక్కుపోయాయి.
బయటకు వచ్చిన తల్లి బాలుడి కోసం రోడ్డుపై పరుగులు తీసింది. దూరంగా కుక్కల గుంపును చూసిన స్థానికుడు ఒకరు కర్రతో వాటిని తరిమేశారు. తీవ్రంగా గాయపడిన ఆ బిడ్డను ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే కన్నుమూశాడు. పెళ్లయిన పన్నెండేళ్లకు పుట్టిన కొడుకు ఇలా అర్ధంతరంగా మృత్యువాతపడడంతో ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. ఈ ఘటనపై ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. గ్రామంలో కుక్కల బెడద తొలగించాలని మున్సిపల్, పంచాయతీ శాఖ అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
పిచ్చికుక్క దాడిలో 20మందికి గాయాలు- ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు