Two People Died in Tirupati Suffering From Diarrhea five in critical condition : తిరుపతిలో డయేరియా కలకలం రేగింది. అతిసారం లక్షణాలతో నగరంలోని పాస్ మనోవికాస్ స్వచ్చంధ సేవా సంస్థలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు మానసిక దివ్యాంగులు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆశ్రమంలో అస్వస్థతకు గురైన 8 మందిని చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వీరిలో శేషాచలం, గణపతి అనే వ్యక్తుల పరిస్థితి విషమించడంతో మరణించారు. తిరుపతి ఆర్డీఓ (RDO) నిశాంత్‌కుమార్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీహరి రుయా ఆస్పత్రికి చేరుకుని బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రాష్ట్రం వ్యాప్తంగా డయేరియా విజృంభించడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధులపై సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సీజనల్ వ్యాధుల విషయంలో ముందు నుంచే అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇప్పుడు చర్యలకు దిగితే పూర్తి ఫలితాలు రావని సీఎం అన్నారు.
ఆయా శాఖల్లో 2014 నుంచి 2019 వరకు నాటి టీడీపీ పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు కార్యాచరణ అమలు చేస్తున్నామని, ఫీవర్ కేసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, హైరిస్క్ కేసులపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారులు వివరించారు.
రోజురోజుకూ పెరుగుతున్న డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. పిడుగురాళ్లలో రెండు రోజుల్లో 15 మందికి డయేరియా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. దీంతో డయేరియా ప్రబలకుండా అధికారుల అప్రమత్తమై పారిశుద్ధ్యం, తాగునీరు నిర్వహణపై ఆరా తీస్తున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు అస్వస్థత! - పెరుగుతున్న డయేరియా కేసులు - Diarrhea in Joint Anantapur