CM Chandrababu Review on Paddy Buying : ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Officers Cheating Paddy Farmers : కృష్ణా జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో కస్టోడియల్ ఆఫిసర్, టీఏలను ఈ మేరకు సస్పెండ్ చేసింది. లారీల్లో ఎక్కువ బస్తాలు ధాన్యం లోడ్ చేస్తూ, రికార్డులు తక్కువ చూపిస్తున్న వైనంపై బుధవారం సీఎం చంద్రబాబు చిట్ చాట్‌లో మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళారు. సీఎం దీనిని సీరియస్‌గా తీసుకోవటంతో పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ శాఖాపర చర్యలకు ఆదేశించి సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు.
మిల్లర్లతో ధర మీరే మాట్లాడుకోండి : కృష్ణా జిల్లా పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకలు జరిగాయి. లారీల్లో ఎక్కువ బస్తాలు ధాన్యం లోడ్ చేస్తూ, రికార్డులు తక్కువ చూపిస్తున్న వైనం నెలకొంది. మిల్లర్లతో ధర మీరే మాట్లాడుకోండంటూ ఎమ్మార్వో స్థాయి అధికారులు మాట్లాడుతున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 34వేల రూపాయలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు - మిల్లర్లు కుమ్మక్కై రైతుల్నిమోసగిస్తున్నారని రైతుల మండిపడ్డారు. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి, అధికారులు రికార్డుల్లో తక్కువ చూపిస్తున్నారని ఆక్షేపించారు. ఈ చర్యతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తెలిపారు.
ధాన్యం కోతలు ముమ్మరం - మందగించిన కొనుగోళ్లతో రైతుల అవస్థలు
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటీవీ ద్వారా సీఎం వివరాలను పరిశీలించారు. లారీలో 315 బస్తాలు లోడ్ చేసి రికార్డుల్లో మాత్రం 290 చూపుతున్నారని మీడియా ప్రతినిధులు ఆధారాలు చూపించగా వాటిని పరిశీలించి, తన వాట్సప్‌కు పంపాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. రాత్రి ఆయన నివాసంలో రైతు సమస్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు క్రమం తప్పకుండా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నచిన్న సమస్యలు సాకుగా చూపి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏ ఒక్క చోటా ధాన్యం కొనుగోలు జరగలేదన్న మాట ఉత్పన్నం కాకూడదని స్పష్టం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు.
24 గంటల్లో ధాన్యం డబ్బులు మీ చేతుల్లోకి : గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు పడ్డ ఇబ్బందులు పునరావృతం కాకుండా చక్కదిద్ది సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన నెలకు కూడా ధాన్యం డబ్బులు రైతులకు అందేవి కావని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 24 గంటల్లోపే ధాన్యం డబ్బులు రైతులు ఖాతాల్లో వేస్తున్నామని, దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. ధాన్యం సంచుల సమస్యలు కూడా తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం గతేడాది 71,002 మంది రైతుల నుండి 4,43,904 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేయగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1,30,580 మంది రైతుల నుండి 9,14,680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలోనే డబ్బులు రైతులకు అందించామని అధికారులు సీఎంకు వివరించారు.
తిరుపతి జిల్లాను వీడని ఫెయింజల్ - 912 హెక్టార్లలో దెబ్బతిన్న వరి పంట
ఇద్దరు అధికారులు సస్పెండ్ : పౌరసరఫరాల, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పని చేసి ధాన్యం కొనుగోలుపై దృష్టి సారించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రైతు భరోసా అవకతవకల ఆధారాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ శాఖపరమైన చర్యలకు ఆదేశించారు. విచారణ జరిపి అవకతవకలు జరిగినట్లు నిర్థారించిన అధికారులు కస్టోడియల్ ఆఫీసర్, టీఏలను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ చర్యలతో పామర్రు, పెనమలూరు నియోజకవర్గ మండల స్థాయి అధికారుల్లో కదలిక వచ్చింది. ఫిర్యాదు చేసిన రైతులకు తహసీల్దార్లు ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా కలిసి సమస్య పరిష్కరించుకోవాలంటూ కొందరు రైతులకు ఎమ్మార్వోలు ఫోన్ చేసి పిలిపిస్తున్నట్లు సమాచారం.
రైతులను వణికిస్తున్న ఫెయింజల్ - తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్