Turmeric Crop Cultivation to Incease in Nizamabad : నిజామాబాద్ జిల్లాలో పసుపు పంట పూర్వ వైభవం వైపు అడుగులేస్తోంది. ఈ సీజన్‌లో పసుపునకు రూ.20 వేల పైచిలుకు ధరలు పలకడంతో మళ్లీ పసుపు సాగువైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. నిజామాబాద్ మార్కెట్‌లో రూ.18 వేల పైచిలుకు గరిష్ఠ ధర రాగా, సగటు ధర సైతం రూ.15 వేలు దాటింది. అలాగే మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో నిజామాబాద్ రైతుల పసుపు పంటకు ఏకంగా రూ.20 వేలకు పైగా ధర వచ్చింది. మంచి ధరలు రావడంతో ఇందూరు అన్నదాతలు మరోసారి పసుపు సాగు పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
జూన్ మొదటి వారంలోనే రైతులు పసుపు విత్తడం ప్రారంభిస్తారు. ఇప్పటికే దుక్కిలు దున్ని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఐదేళ్లుగా గిట్టుబాటు ధర దక్కక సాగుకు దూరమైన రైతులు, ఇప్పుడు మంచి ధర పలుకుతుండటంతో తిరిగి పసుపు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వీరంతా విత్తనం సేకరించే పనిలో ఉన్నారు. దీంతో పసుపు విత్తనానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో అత్యధికంగా, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో స్వల్పంగా పసుపు సాగు చేస్తారు. అధిక ధరల కారణంగా విత్తనానికి డిమాండ్ ఏర్పడింది. పసుపు పంట చేతికొచ్చినప్పుడే మేలైన పసుపును సేకరించి పెట్టుకుంటారు. అయితే ఏటా కనిష్ఠ ధరలతో రైతులు విత్తనం గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు అధిక ధరల కారణంగా విత్తనాలు నిల్వ ఉన్న రైతుల నుంచి మిగతా రైతులు సేకరిస్తున్నారు. ఒక్కో ట్రాలీ విత్తనం రూ.60 వేలు పలుకుతోంది. ఇది 2 ఎకరాలకు సరిపోతుంది. ఏటా ఎకరం పండించే రైతు, ఈసారి అదనంగా మరో రెండెకరాల్లో సాగుకు సిద్ధం అవుతున్నారు.
గతంలో పసుపు పంటకు సరైన ధరలు అందక రైతులు సాగు విస్తీర్ణం తగ్గించారు. కొందరైతే పసుపు సాగు చేయడం పూర్తిగా మానేశారు. ఇటీవల పసుపు పంటకు మంచి ధర లభించడంతో మళ్లీ పసుపు సాగువైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో జిల్లాలో విత్తన పసుపుకు డిమాండ్ ఏర్పడింది. - స్థానిక రైతులు
దశాబ్ధాల తర్వాత పసుపు పంటకు రికార్డు ధర - ఈ సీజన్‌లో ఇందూరు మార్కెట్‌లో వెయ్యి కోట్ల లావాదేవీలు
గడిచిన నాలుగైదేళ్లలో పసుపు సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ఇదివరకు జిల్లావ్యాప్తంగా దాదాపు 40 వేల ఎకరాల్లో పసుపు సాగయ్యేది. గత సీజన్‌లో ఏకంగా 23 వేల ఎకరాలకు పడిపోయింది. సాగు వ్యయం పెరగడం, ధర క్వింటాకు రూ.5 వేల నుంచి ఆరున్నర వేల మధ్యలోనే ఉండటం రైతులను నిరాశకు గురి చేసింది. కరోనా తర్వాత అంతర్జాతీయంగా పసుపు వినియోగం పెరిగినా, డిమాండ్ రాకపోవడంపై చర్చ సాగింది. ఈ క్రమంలోనే దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టింది. దీంతో ఎగుమతులకు అవకాశం ఏర్పడి గడిచిన ఏడాది కాలంగా ధరలో కదలిక వచ్చింది. ఈ సీజన్‌లో మరింత పుంజుకొని సరాసరి రూ.13 వేల నుంచి రూ.16 వేల మధ్య ధరలు దక్కాయి. దాంతో పాటు కొమ్ముకే కాదు, మండకు కూడా డిమాండ్ ఏర్పడటంతో రైతులు పసుపు వైపు మొగ్గు చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 20 శాతం మేర పసుపు సాగు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.