Tirupati Laddu Report Updates : తిరుమల లడ్డూ తయారీలో కీలకమైన ఆవు నెయ్యి సేకరణకు అనుసరిస్తున్న విధానాలను మార్చాలని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. టెండర్ డాక్యుమెంట్ నిబంధనలన్నీ మార్చాలని సిఫార్సు చేసింది. లడ్డూ నాణ్యంగా లేదని, సువాసన, రుచి పూర్వం మాదిరిగా లేవని ఆరోపణలు వెల్లువెత్తిన వేళ కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ అంశంపై దృష్టిపెట్టింది.
లడ్డూలో ఆవు నెయ్యి నాణ్యంగా లేదని ఆరోపణలు రాగా టీటీడీ జూన్‌లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జూన్ 16 నుంచి ఆగస్టు 6 వరకు అధ్యయనం చేసిన కమిటీ తిరుమల లడ్డూ కోసం నేతిని ఎలా సేకరించాలో నివేదిక సమర్పించింది. తాజాగా నెయ్యిలో కల్తీ జరిగిందని బయటపడిన వేళ ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. కమిటీ సభ్యులు అధ్యయనం చేసి ఆగస్టులో సమర్పించిన నివేదికలోనే ఇంత తక్కువ ధరకు ఆవు నెయ్యిని ఎలా సరఫరా చేస్తారని ప్రస్తావించి తప్పుబట్టారు.
TTD Expert Committee Report to AP Govt : నాణ్యమైన, స్వచ్ఛమైన ఆవు నెయ్యి తిరుమలకు చుట్టుపక్కల 800 కిలోమీటర్ల పరిధిలో ఉన్న డెయిరీల నుంచి మాత్రమే సేకరించాలని నిపుణుల కమిటీ సూచించింది. ఆవుపాలు బాగా ఉత్పత్తయ్యే ప్రాంతాల నుంచే సేకరణ జరిగేలా చూడాలని పేర్కొంది. వెన్నను 120 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 4 నుంచి 5 నిమిషాల పాటు మరిగించినప్పుడు మాత్రమే సువాసన నిండిన నాణ్యమైన నెయ్యి సేకరణ సాధ్యమవుతుందని కమిటీ పేర్కొంది.
నమూనాలకు పాయింట్లు ఇవ్వాలి : తిరుమల చుట్టుపక్కల 800 కిలోమీటర్ల పరిధిలోనే ఈ తరహాలో పాలను మరిగించి వెన్న తీసే అలవాటు ఉందని తెలిపింది. ఉత్తరాదిలో 110 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మాత్రమే వెన్నను మరిగించి నెయ్యి తీస్తారని వివరించింది. అది తిరుపతి లడ్డూలో వినియోగించుకునేంత నాణ్యత, సువాసనతో ఉండదని పేర్కొంది. నాణ్యమైన నెయ్యిని ఎంచుకునేందుకు ల్యాబ్ ఏర్పాటు చేయాలని సూచించింది. దానిలో పరిశీలించే అంశాల ఆధారంగా నమూనాలకు పాయింట్లు ఇవ్వాలని తెలిపింది. మొత్తం 9కి 7 పాయింట్లు పొందితేనే నాణ్యంగా ఉన్నట్లు నిర్ధారించాలని చెప్పింది.
ఆవు నెయ్యి సరఫరాకు టెండర్ ద్వారా డెయిరీలను ఎంపిక చేసిన తర్వాత టీటీడీ అధికారులు, ఆవు నెయ్యి కమిటీ సభ్యులు వాటిని సందర్శించాలని కమిటీ సూచించింది. ప్లాంట్లో వారికి సొంతంగా నాణ్యత పరిశీలించే పరిశోధన కేంద్రం ఉందో లేదో చూడాలని పేర్కొంది. 10 అంశాలను పరిశీలించి మార్కులు ఇవ్వాలని ఒక్కో అంశానికి గరిష్ఠంగా 5 మార్కులు కేటాయించాలని సూచనలు చేసింది. కనీసం మూడు మార్కులు వస్తేనే సాంకేతికంగా ఆ డెయిరీలు నెయ్యి సరఫరాకు అనువైనవిగా గుర్తించాలని కమిటీ వెల్లడించింది.
Tirupati Laddu Row : నెయ్యి సరఫరాదారులు పక్కాగా రికార్డులు నిర్వహించాలని కమిటీ సూచనలు చేసింది. అధికారులు ఆయా ప్లాంట్లను ఆర్నెళ్లకు రెండుసార్లయినా తనిఖీలు చేయాలని పేర్కొంది. సరఫరాదారులు ఆవుపాలు ఎలా సేకరిస్తున్నారు? ఎంత సేకరిస్తున్నారు? ఆవునెయ్యి ఎలా తయారు చేస్తున్నారు? వారివద్ద ఉన్న నాణ్యత నివేదికలు తదితర అంశాలను ఆకస్మిక తనిఖీల ద్వారా గుర్తించాలని తెలిపింది. టెండర్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఒప్పందాలు రద్దు చేయాలని వివరించింది.
టీటీడీకి రోజుకు 15 టన్నుల ఆవు నెయ్యి అవసరమని కమిటీ పేర్కొంది. ఇందుకోసం రోజుకు 3.5 లక్షల లీటర్ల నుంచి 5 లక్షల లీటర్ల వరకు ఆవు పాలు కావాలని తెలిపింది. ఆ పాలలో కొవ్వు 3.5 నుంచి 4 శాతం వరకు ఉండాలని చెప్పింది. ప్రతి నెయ్యి ట్యాంకరు నుంచి నమూనాలు సేకరించి, టీటీడీ పరిశోధన కేంద్రంలో పక్కాగా పరీక్షించాలని పేర్కొంది. నిబంధనల ప్రకారం నాణ్యత ఉందో లేదో కమిటీ సభ్యులు గుర్తించాలని కమిటీ సూచించింది.
నిర్ధారించిన తర్వాతే అనుమతించాలి : ఆ తర్వాతే ఆ నెయ్యిని అనుమతించాలో, నిరాకరించాలో కమిటీ తేల్చాలంది. ఇది చాలా కీలకమని అందువల్ల ఐదుగురు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని వివరించింది. వీటిలో నాణ్యతను నిర్ధారించే విషయంలో శిక్షణ పొందిన సభ్యులు ఉండాలని చెప్పింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రమాణాల ప్రకారం వీటిని పరీక్షించాలని పేర్కొంది. ప్రస్తుతం టీటీడీలో చేస్తున్న పరీక్షలు పూర్తి నాణ్యతను తేల్చగలిగేవి కావని వెల్లడించింది.
ఆవు నెయ్యి, ఇతర దినుసులను పరీక్షించగల ల్యాబరేటరీని, మౌలిక సౌకర్యాలను టీటీడీ ఏర్పాటు చేసుకోవాలని కమిటీ సూచించింది. మంచి తయారీదారుల నుంచి ఆ పరికరాలు సమీకరించుకోవాలని పేర్కొంది. ఆ ల్యాబరేటరీలో సమగ్ర శిక్షణ పొందిన సిబ్బందిని నియమించుకోవాలని సిఫార్సు చేసింది. టీటీడీలో ప్రస్తుతం వారానికి సరిపడా ఆవు నెయ్యి నిల్వకు ఏర్పాట్లున్నాయన్న కమిటీ 15 రోజులకు సరిపడా నిల్వ చేసుకునేలా వసతులు పెంచుకోవాలని తెలిపింది. మొదట వచ్చిన నెయ్యి మొదట వినియోగించే పద్ధతి అనుసరించాలని కమిటీ సూచనలు చేసింది.
కల్తీ నెయ్యిని చిటికెలో కనిపెట్టేయొచ్చు - ఈ చిట్కాను పాటిస్తే సరి! - Ghee Purity Test At Home
తిరుమల లడ్డూకు మళ్లీ నందిని సువాసన! - కిలో నెయ్యి రూ.478 - NANDINI GHEE TO TIRUMALA LADDU