TS Group 1 Prelims Exam 2024 in OMR Method : రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ లేదా సీబీఆర్‌టీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశముందని, పరీక్ష నిర్వహణ పద్ధతిపై తుది నిర్ణయాన్ని కమిషన్ తీసుకుంటుందని ఇప్పటికే జారీ అయిన గ్రూప్-1 నోటిఫికేషన్‌లో కమిషన్ తెలిపింది. గ్రూప్-1కు భారీ సంఖ్యలో 4.03 లక్షల అర్జీలు వచ్చినందున సీబీఆర్‌టీ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తే సాంకేతిక ఇబ్బందులు వస్తాయని టీఎస్‌పీఎస్సీ భావించింది. ఈ క్రమంలోనే ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది.
TSPSC Group-1 2024 : తెలంగాణ ప్రభుత్వ విభాగాల్లో 563 గ్రూప్-1 సర్వీసు పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. గతంలో అర్జీ చేసిన అభ్యర్థులు మరోసారి చేయాలని, కొత్తగా విద్యార్హత పొందిన ఉద్యోగార్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. ఇందుకుగాను దాదాపు నాలుగు లక్షల మందికిపైగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఈ క్రమంలోనే కమిషన్ మార్చి 23 నుంచి 27 వరకు సవరణకు అవకాశం కల్పించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలా? యూజీసీ-నెట్ 2024కు అప్లై చేసుకోండిలా! - UGC NET 2024
గత 2022 ఏప్రిల్ 26న టీఎస్‌పీఎస్సీ 503 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ను ఇచ్చింది. అందుకనుగుణంగా ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా అభ్యర్థులను ఎంపిక కోసం ఏర్పాట్లు చేసింది. అదే సంవత్సరం అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. అనంతరం పేపర్ లీకేజీ కారణంగా ఆ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. తిరిగి 2023 జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అందులోని లోపాలున్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
దీనిని డివిజన్ బెంచ్ కూడా సరైనదేనని తెలిపింది. దీంతో టీఎస్‌పీఎస్సీ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ వేసింది. ఈ లోపు తెలంగాణలో ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌ను కమిషన్ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్స్ తేదీలు విడుదల - ఆగస్టులో గ్రూప్2 పరీక్షలు