Truck Hit Motorcycle In Hyderabad : నిత్య జీవితంలో ఎప్పుడూ ఏ ప్రమాదం ముంచుకువస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి. మనం మంచిగానే వాహనం నడుపుతున్నా, ఇతరులు ఏ విధంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారో చెప్పలేం. ఎంత జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తున్నా, కొన్ని సార్లు ఇతరులు చేసిన తప్పులకు ఎందరో అమాయకులు బలవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. బైక్‌ను ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది.
రోడ్డు పక్కన ఉన్న ఇంటిని ఢీకొట్టిన కారు - అక్కడికక్కడే ఇద్దరు మృతి
Truck Hit Motorcycle Viral video : హైదరాబాద్ కర్మన్‌ఘాట్ వద్ద ఓ లారీ డ్రైవర్ దురాగతంతో ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్ పరిధిలో 14వ తేదీ రాత్రి 11.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత కారును ఢీకొట్టిన లారీ డ్రైవర్ భయంతో ముందు వెళ్తున్న మరో ద్విచక్రవాహనంపైకి దూసుకెళ్లాడు. స్థానికులు కొడతారనే భయంతో కనీసం వాహనాన్ని ఆపకుండా వేగం పెంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర ముందుకెళ్లాడు. ద్విచక్రవాహనదారుడు హఫీజ్ ప్రాణాలు కాపాడుకునేందుకు లారీ క్యాబిన్ పట్టుకుని సమయోచితంగా వ్యవహరించాడు.
తృటిలో తప్పిన ప్రాణాపాయం : లారీ డ్రైవర్ ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టి అలాగే 2 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు హఫీజ్‌కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఢీకొట్టగానే లారీ పైకి ఎక్కి డోర్ పట్టుకొని హఫీజ్ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అయినా డ్రైవర్ ఆపకుండా రెండు కిలో మీటర్ల దూరం లారీని అలాగే తీసుకెళ్లాడు. వాహనదారుడు లారీ బ్యానెట్ పైనే నిలబడి ఆపాలంటూ ఆర్తనాదాలు చేశాడు. ఈ ఘటనను వెనుకాల వాహనంపై ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది.
ఈ లారీని కొంతమంది బైకర్లు వెంబడించడంతో లారీ వేగంతో ఎల్బీనగర్ వైపు వెళ్లింది. చివరకు లారీ డ్రైవర్ వనస్థలిపురం వద్ద తన వాహనాన్ని ఆపేశాడు. తరువాత వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు జరిగిన ఈ ఘటన మిగతా వాహనదారులను భయభ్రాంతులకు గురిచేసింది. చట్టాలు తమను ఏం చేయలేవనే ధీమాతోనే కొందరు లారీ డ్రైవర్లు ఇలా నిర్లక్ష్యంగా నడుపుతుంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆపి బాధితుడిని ఆదుకోవాల్సింది పోయి అలాగే నిర్లక్ష్యంగా దూసుకెళ్లడం వాహనదారులను ఆందోళనకు గురిచేసింది.