Students Works in Yerragondapalem ST Gurukul : ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాబుద్ధులు లభిస్తాయనే ఆశతో వారిని గిరిజన పాఠశాలలో చేర్పించారు. కానీ వారికి పాఠాలు చెప్పాల్సిన సిబ్బంది విద్యార్థుల చేత వంట చేయిస్తున్నారు. పుస్తకాలు పట్టాల్సిన ఆ చేతులతో వారు గరిట పట్టాల్సిన పరిస్థితి కల్పించారు. ఇదేంటని ప్రశ్నిస్తే వారిని బెదిరించి శిక్షలు వేస్తున్నారు. ఈ విషయాన్ని పిల్లలు తమ తల్లిందండ్రులకు తెలుపగా ఈ సంగతి ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
Yerragondapalem ST Gurukul Hostel : యర్రగొండపాలెం ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం ఉంది. ఇందులో విద్యార్థులతో వెట్టిచాకిరి చేయిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది. చదువుకోవాల్సిన వారికి వంట పనులు అప్పగిస్తున్నారు. ఆదివారం ఉదయం టిఫిన్ కోసం తొమ్మిది తరగతి విద్యార్థులతో సుమారు 700 చపాతీలు చేయించారు. పిండి కలపడం దగ్గర నుంచి పెనం మీద చపాతీ కాల్చేవరకు మొత్తం వారికే అప్పగించారు.
ఇంకా ఉడికించిన కోడిగుడ్ల పెంకు తీయడం వంటివి విద్యార్థులతో చేయించారు. కొంత కాలం నుంచి ఈ తంతు సాగుతుండగా పిల్లలు తమ తల్లిదండ్రులకు తెలపడంతో ఆదివారం బయటపడింది. మరోవైపు పనులు చేయని విద్యార్థులకు శిక్షలు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీడీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ గురుకులంలో మొత్తం 250 మంది విద్యార్థులు ఉంటున్నారు.
రొట్టెలు కాలుస్తున్న విద్యార్థి : ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వంతుల వారీగా బాధ్యతలు అప్పగించి వంట పనులు చేయిస్తున్నారు. ఇక్కడ వంట మనుషులు, స్వీపర్లు, మొత్తం ఐదు మంది ఉండాలి. కానీ నలుగురు మాత్రమే ఉన్నారు. ఈ నలుగురు కూడా పర్మినెంట్ వర్కర్లు కాదు. వీరితో పనులు చేయించుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో పిల్లల చేత వెట్టిచాకిరి చేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చదువు అభ్యసించడానికి వచ్చిన వారికి ఈ తిప్పలేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై గురుకుల ప్రిన్సిపల్ సురేష్‌బాబును సంప్రదించగా నలుగురు సిబ్బందిలో ఇద్దరు సెలవు పెట్టడంతో విద్యార్థుల సాయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.