Telangana Man Tortured in Cambodia : ఉపాధి కోసం కొందరు నిరుద్యోగులు వేరే దేశాలకు వెళ్తుంటారు. అధిక వేతనమంటూ ఏజెంట్లు చెప్పిన మాయమాటలు నమ్మి కొన్నిసార్లు మోసపోతుంటారు. రాష్ట్రానికి చెందిన పలువురు కాంబోడియా దేశంలో ఇలాగే మోసపోయారు. గత కొంతకాలంగా ఈ తంతు సాగుతున్నా, ఇటీవల ఈ వ్యవహారం తెరపైకి రావడంతో అక్కడ బాధలు అనుభవిస్తున్న వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు కాంబోడియా దేశంలో పెడుతున్న చిత్రహింసలకు సంబంధించి ఒక వీడియోను విడుదల చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది.
బట్టబయలైన కాంబోడియా స్కామ్ - విముక్తి పొందిన విశాఖ యువకులు - Rescued From Cyber Fraud Rackets
బాధితుడి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం, మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంథంపల్లి గ్రామానికి చెందిన ప్రకాశ్ అనే యువకుడు కాంబోడియా దేశంలో తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కుటుంబసభ్యులకు ఓ వీడియో పంపించాడు. ఆ వీడియో చూసిన కుటుంబసభ్యులు చలించిపోయారు. ప్రభుత్వమే తమ కుమారుడిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తోంది.
ఆస్ట్రేలియా అని చెప్పి కాంబోడియాకు : ప్రకాశ్ బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ కొంతకాలం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఈ సమయంలోనే ఓ ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు ఉన్నాయనే సమాచారం తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా, తమకు అంత స్తోమత లేదని చెప్పారు. వారు వద్దని చెప్పినా వినకుండా ఆస్ట్రేలియాకు బయలుదేరాడు. ఆ ఏజెన్సీ వారు మాత్రం అతడిని ఆస్ట్రేలియా తీసుకెళ్లకుండా కాంబోడియాలో వదిలేశారు.
అక్కడ వారు విద్యుత్ షాక్, ఇంజెక్షన్లు ఇవ్వడం వంటి చిత్రహింసలు పెడుతున్నారని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అక్కడ నరకయాతన అనుభవిస్తున్నానని, వాళ్లు చెప్పిన పని చేయకపోతే కరెంట్ షాక్ ఇస్తున్నారని, ఆ బాధలు తట్టుకోలేక పోతున్నానంటూ బాధితుడు తన తమ్ముడికి వివరించాడు. అలాగే తనతో పాటు ఇంకా కొంతమంది పురుషులు, మహిళలు కూడా ఉన్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక బతుకు మీద నమ్మకం లేదని రోదిస్తూ వీడియో పంపించాడని బాధితుడి తమ్ముడు వాపోయాడు. వెంటనే తన అన్నను కాంబోడియా నుంచి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
ఔట్ ఇచ్చారని టీమ్ వాకౌట్- సగం మ్యాచ్లో విజేతగా మరో జట్టు- అసలేం జరిగిందంటే?