Tomato Farmers Agitation in Anantapur: లారీ అసోసియేషన్, వ్యాపారుల వివాదంతో నష్టపోతున్నామంటూ రైతులు రోడెక్కారు. అనంతపురం టమాట మార్కెట్లో లారీ అసోసియేషన్, వ్యాపారుల మధ్య వివాదంతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. లారీ అసోసియేషన్ దందా ఆపాలని, వ్యాపారులు తమ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ రైతులు 44వ నెంబర్ రహదారిపై ఆందోళన నిర్వహించారు. గతంలో కక్కలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మార్కెట్‌కు వచ్చే టమాట లారీల నుంచి డబ్బులు వసూలు చేసేవారు.
కోర్టు ఆదేశాలున్నాయని అధికారిక వసూళ్లను అధికారులు నిలిపివేయడంతో, లారీ అసోసియేషన్ వసూళ్ల దందా మొదలు పెట్టిందని తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లోని పలు గ్రామాల నుంచి రోజూ నాలుగు వందల వరకు లారీలు టమాట లోడు తీసుకొని వస్తుండగా, ఈ వాహనాల నుంచి లారీ అసోసియేషన్ మామూళ్ల దందా చేస్తోందని వాపోయారు. తాము అడిగినంత ఇవ్వకపోతే టమాట లారీని గంటలకొద్దీ బయటే నిలిపివేస్తూ దౌర్జన్యం చేస్తున్నారన్నారు.
దీంతో వ్యాపారులు, లారీ అసోయేషన్ల మధ్య వివాదం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు రైతులకు ధర తగ్గించేశారు. లారీ అసోసియేషన్ నాయకులు, వ్యాపారులు తమను నష్టపరుస్తున్నారంటూ రైతులు రోడ్డెక్కారు. ఆందోళన జరుగుతున్న చోటుకు చేరుకున్న పోలీసులు, రైతులకు నచ్చజెప్పి లారీ అసోసియేషన్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు. లారీ అసోసియేషన్ నాయకులపై ఏపీ రైతుసంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వెళ్లారు.
పంటను దాచుకున్న రైతులకు పోలీసులు నోటీసులు - farmers received notices