Tollywood Actress Suryakantham 100th Birth Anniversary : తన నటనా వైభవంతో వెండి తెరపై సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన నటి సూర్యకాంతం. పాత్ర ఏదైనా ఆమె పరకాయ ప్రవేశం చేస్తుంది. అంతటి మహానటి పుట్టింది, నటనలో ఓనమాలు నేర్చుకున్నది తూర్పు తీరంలోనే( కాకినాడలోనే).
సూర్యకాంతం కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో 1924 అక్టోబరు 28న (28-10-1924) జన్మించారు. సూర్యకాంతం ఆరేళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు. కాకినాడలోని అక్క శేషమ్మ దగ్గర ఆమె పెరిగారు. అప్పుటి నుంచే నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. సినిమాలు చూడటమన్నా, డిటెక్టివ్ నవలలు చదవడమన్నా ఆమెకు ఎంతో ఇష్టం.
గయ్యాళి అత్త సూర్యకాంతంనే భయపెట్టిన 'ఆమె'- అప్పట్లో జరిగిన ఈ ఆసక్తికర సంఘటన తెలుసా?
పురుషులతో సైకిల్ పోటీల్లో గెలిచి : కాకినాడలో జరిగిన ఒక సైకిల్ రేసులో సూర్యకాంతం పురుషులతో పోటీ పడి విజేతగా నిలిచారు. యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ ప్రదర్శించిన సతీ సక్కుబాయి, తులాభారం, చింతామణి వంటి నాటకాల్లో సూర్యకాంతం పురుష పాత్రలు పోషించారు.
అలా నటనవైపు : సినిమా వాల్ పోస్టర్లను చూస్తూ నటనపై ఇష్టం పెంచుకున్నారు సూర్యకాంతం. సురభి నాటక సమాజం కాకినాడలో వేసిన నాటకాలు చూసి ఆకర్షితురాలు అయ్యారు. కాకినాడలోని ది యంగ్మెన్స్ హ్యాపీక్లబ్‌లో (The Youngmen's Happyclub) చేరి నాటకాలు వేయడం ప్రారంభించారు. రిహార్సల్‌కు వీకే రాయపురం నుంచి సైకిల్, రిక్షాలో వచ్చేవారు. ఈ నేపథ్యంలోనే అంజలి, ఎస్వీ రంగారావు వంటి వారితో పరిచయాలు పెరిగాయి. ఈ క్రమంలోనే సినీ ప్రపంచంలో అడుగు పెట్టారు. కాకినాడలోని మెక్లారిన్ పాఠశాలలో విద్య అభ్యాసం చేశారు. ఇయ్యూని అప్పల ఆచార్య వద్ద వీణ, గాత్ర సంగీతంలో శిక్షణ పొందారు.
పకోడి కోసం సెట్లో సూర్యకాంతం గొడవ!
మీరు వస్తే వహ్వారే : బాపూగారు సూర్యకాంతంపై వేసిన కార్టూను ముళ్లపూడి వెంకటరమణ వర్ణిస్తూ దురుసునోటి పలుకుబడికి పంతులమ్మ మీరు. మీరు లేని బయోస్కోపు ఉప్పులేని చారు. మీరు వచ్చి నిలిస్తే ఆ సీను ఇక వహ్వారే. అంటూ గొప్పగా చెప్పారు.
నేనూ మంచిగా చేస్తే ఎలా! : గయ్యాళి పాత్రలతో మీకు ఇబ్బంది లేదా? అని ఎవరైనా అడిగితే అందుకు సూర్యకాంతం చిరునవ్వుతో నేను గయ్యాళిగా వేయబట్టే మిగతా పాత్రలు అంత మంచిగా అనిపిస్తున్నాయి. నేనూ మంచిగా చేస్తే ఎలా అని సమాధానం ఇచ్చారు. నటుడు గుమ్మడి ఓ సారి ఆమెతో సూర్యకాంతం అనే చక్కని పేరును ఇంకా ఎవ్వరూ పెట్టుకోకుండా చేశావని చమత్కరించారట.
సాయం సంపత్తి : దివిసీమ తుపాను సమయంలో కాకినాడ ర్యాలీలో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ వంటి వారితో పాటు ఇంటింటికి తిరిగి జోలె పట్టి సూర్యకాంతం విరాళాలు సేకరించారు.
వెండితెరపై అమ్మో సూర్యకాంతం..! మనసు బంగారం
హీరోయిన్ కాబోయి : సూర్యకాంతం సినిమాల్లో తొలుత చిన్న పాత్రల్లో మెప్పించారు. సౌధామిని చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యారు. కానీ కారు ప్రమాదంలో ముఖానికి గాయం కావడంతో ఆ అవకాశం కొల్పోయింది. 26 ఏళ్ల వయసులో సంసారం చిత్రంలో 60 ఏళ్ల గయ్యాళి అత్తగా నటించారు. అక్కడి నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు.