Bank Lones Repaid To Tidco Beneficiaries : టిడ్కో లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకుండా లబ్ధిదారుల పేరిట తీసుకున్న రుణాన్ని కూటమి ప్రభుత్వం చెల్లిస్తుందని టిడ్కో ఛైర్మన్ అజయ్‌కుమార్ తెలిపారు. లబ్ధిదారులు కట్టాల్సిన మొత్తం 145 కోట్ల రూపాయలను బ్యాంకులకు చెల్లిస్తామన్నారు. కృష్ణా జిల్లా జక్కంపూడి గ్రామంలో టిడ్కో ఇళ్ల పరిశీలనకు వచ్చిన ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. టిడ్కో ఇళ్ల కోసం స్థలాలు ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదన్నారు. వారికి కూడా విడతల వారీగా డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్లకు కూడా బకాయి డబ్బులు చెల్లిస్తామని చెప్పారు.
ప్రజల సొంత ఇంటికల నెరవేర్చేలా గతంలో చంద్రబాబు నాలుగున్నర లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని అజయ్‌కుమార్ గుర్తు చేసారు. 39వేల కోట్లతో జర్మనీ టెక్నాలజీతో వీటి నిర్మాణం చేపట్టారన్నారు. నిర్మాణం పూర్తై మౌలిక వసతులు కల్పించాల్సిన సమయంలో ఎన్నికలు వచ్చాయన్నారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు ఆపేసిందని మండిపడ్డారు. నాలుగున్నర లక్షల మంది లబ్దిదారులు ఉంటే కేవలం 2.60 లక్షల మందికే ఇళ్లు కేటాయించారని విమర్శించారు. వాటికి కూడా నిధులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపేశారని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వందల కోట్ల ప్రజా ధనం వృథా అయ్యిందన్నారు. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఉంటే ఇప్పుడు టిడ్కో ఇళ్లు కళకళలాడేవి అని అన్నారు.
ఇంటి తాళాలు ఇచ్చారు సరే - కనీస వసతులు ఏవి ?
జక్కంపూడితో పాటు అన్ని ప్రాంతాల్లోనూ టిడ్కో ఇళ్లను పరిశీలిస్తామని అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల సీఎం చంద్రబాబు టిడ్కో ఇళ్లపై సమీక్ష చేసి పనులు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. రూ.4,500 కోట్ల హడ్కో రుణం కూడా మంజూరు చేయించారని గుర్తు చేశారు. జూన్ నాటికి కొన్ని ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. మౌలిక వసతులను పూర్తి చేసి నివాస యోగ్యంగా మారుస్తామన్నారు. ఇళ్లు ఇవ్వకుండా లబ్ధిదారుల పేరుతో బ్యాంకు రుణాలు కూడా గత ప్రభుత్వం తీసుకుందని విమర్శించారు. వాయిదాలు కట్టే విషయంలో బ్యాంకులతో మాట్లాడి వెసులుబాటు కల్పిస్తామన్నారు. రూ.145 కోట్లను బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకుందన్నారు.
గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం - టిడ్కో ఇళ్ల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
టిడ్కో ఇళ్ల కోసం స్థలాలు ఇచ్చిన రైతులకు కూడా గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని అజయ్‌కుమార్ దుయ్యబట్టారు. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు విడతల వారీగా డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. పనులు వేగవంతం చేసేలా కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడామన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను కూడా వారికి చెల్లిస్తామని తెలిపారు. టిడ్కో ఇళ్ల లబ్దిదారులు త్వరలోనే గృహ ప్రవేశాలు చేస్తారని పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న బ్లాక్‌ల ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తామన్నారు. 50 వేలు, లక్ష చొప్పున టిడ్కో లబ్దిదారులు చెల్లించగా, ఇతర సొమ్ము బ్యాంకుల నుంచి రుణం ఇచ్చేలా అప్పట్లో ఒప్పందాలు జరిగాయన్నారు. నిజమైన లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. 300 చదరపు అడుగుల ప్లాట్ల విషయంలో గోల్ మాల్ జరిగిందని, వాటిని పరిశీలీస్తున్నామని టిడ్కో ఛైర్మన్ అజయ్‌కుమార్ తెలిపారు.