Boy Died in Srungavarapukota Due to No Road: ‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ మోహన్ రెడ్డి పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో హాస్పిటల్స్‌కి వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి.
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని గిరిశిఖర గ్రామాల్లో మృత్యుఘోషే అందుకు నిదర్శనం. రహదారి సౌకర్యం లేకపోవడంతో పాటు వైద్య సదుపాయాలు సరిగ్గా అందకపోవడంతో ఇక్కడ మూడు నెలల కిందట ముగ్గురు చిన్నారులు, ఓ మహిళ మరణించారు. తాజాగా మరో బాలుడు కన్నుమూశాడు.
ఎన్నాళ్లీ డోలీ మోతలు - ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గిరిజనులు - NO ROADS IN TRIBAL AREAS
బాధితులు, ఆదివాసీ సంఘాల నాయకుల వివరాలు ఇలా ఉన్నాయి. దారపర్తి పంచాయతీ శివారు గూనపాడు గ్రామానికి చెందిన బడ్నాయిన జీవన్‌కుమార్, దాలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, వారిలో పెద్ద కుమారుడు ప్రసాద్‌కు మూడేళ్ల వయసు. సోమవారం ఉదయం బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో హాస్పిటల్లో చేర్చేందుకు తండ్రి తన స్నేహితుడి ద్విచక్ర వాహనంపై కొంతదూరం, నడుచుకుంటూ మరికొంత దూరం తీసుకునివెళ్లారు.
అలా వారి ఇంటి వద్ద నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్టపాలెం చేరుకున్నారు. అక్కడి నుంచి ఎస్.కోటకు వెళ్లేందుకు ఆటో ఎక్కుతుండగా బాలుడు మరణించాడు. దీంతో కన్నీరు దిగమింగుకొని మృతదేహంతో తిరిగి గ్రామానికి చేరుకున్నారు. దారపర్తి, మూలబొడ్డవర పంచాయతీల్లో ఎంతో కాలంగా ఇలాంటి పరిస్థితులున్నా అధికారులు, స్థానిక నేతలు పట్టించుకోవడం లేదంటూ ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జనవరిలో డీఎంహెచ్‌వో, ఐటీడీఏ పీవోలు వచ్చి వైద్య శిబిరాలంటూ హడావుడి చేశారని, తరువాత పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం రోడ్లు వేస్తామని చెప్పి, మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ సమస్య కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనది కాదు. రాష్ట్రంలో అనేక చోట్ల రహదారుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. గిరిజన ఆదివాసి కొండ గ్రామాలకు రహదారి సౌకర్యాలు లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. రహదారి సౌకర్యం లేక మార్గమధ్యలోనే ప్రాణాలు వీడుతున్నారు. కొద్ది రోజుల క్రితం రహదారి సౌకర్యం లేక మార్గమధ్యలోనే అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని దించేసిన హృదయ విదారక ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. దీంతో కుమారుడు మృతదేహంతో ఆ తండ్రి చీకట్లో 8 కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లారు.
అదే విధంగా నిండు గర్భిణిని చేతులతో మోసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే బిడ్డకు జన్మనిచ్చిన ఘటన సైతం అల్లూరి జిల్లాలో జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు పురిటి నొప్పులు రావడంతో 108 ఫోన్ చేయగా ఉదయం 8 గంటలకు అంబులెన్స్ వచ్చి రోడ్డు లేని కారణంగా గ్రామానికి కిలోమీటర్ దూరాన ఆగింది. దీంతో గర్భిణిని అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లే క్రమంలో మార్గ మధ్యలోనే ఆడబిడ్డకు జన్మించింది. ఇలా రహదారులు లేకపోవడం, వైద్య సదుపాయాలు అందకపోవడంతో నిత్యం అనేక ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.