Three Tribals Died in 15 Days : గిరిజనులకు అంత చేశాం ఇంత చేశాం అని చెప్పుకొనే సీఎం జగన్ మోహన్ రెడ్డికి గిరిశిఖర గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక, సకాలంలో వైద్యం అందక అడవి బిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా పట్టడం లేదు. ఓ గిరిజనుడు ద్విచక్ర వాహనంపై భార్య మృతదేహాన్ని పెట్టుకుని కొంత దూరం ఆపై డోలీపై మోసుకొని తీసుకెళ్లిన తీరు చూపరులను కన్నీళ్లు పెట్టించింది. ఈ ఘటన మరువక ముందే మరో చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అధికారులు మాత్రం తమకు ఏమీ తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆదివాసీగిరిజన సంఘం నేతలు ఆరోపిస్తున్నారు.
Tribesmen Died Due to Lack of Medical Treatment : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీ గిరిశిఖర గ్రామం చిట్టంపాడులో 15 రోజుల్లో ముగ్గురు ప్రాణాలు గాలిలో కలిసిపోవడం చర్చనీయాంశమైంది. ఈ గ్రామానికి చెందిన చిన్నారి జన్ని ప్రవీణ్ అనారోగ్యంతో విజయనగరం ఘోషా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిట్టింపాడుకు చెందిన సంవత్సరంన్నర బాబు ప్రవీణ్ దగ్గు, కఫంతో బాధపడుతుండడంతో ఆదివారం తల్లిదండ్రులు సన్యాసిరావు, సన్యాసమ్మ 7 కిలో మీటర్లు మోసుకుంటూ కాలినడకన ఎస్.కోట ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం పరిస్థితి విషమంగా ఉందంటూ విజయనగరం ఘోషా ఆసుపత్రికి వెళ్లమని ఎస్.కోట ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు సూచించారు.
అక్కడికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. చిన్నారి జన్ని ప్రవీణ్ మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్సు అడిగినా ఇవ్వలేదు. దీంతో ప్రైవేటు వాహనంలో బొడ్డవర రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చారు. డబ్బులు లేకపోవడంతో తెలిసిన వారి వద్ద 3 వేల రూపాయలు తీసుకొని కిరాయి చెల్లించారు. చిన్నారి చనిపోవడంతో చిట్టంపాడుతో విషాద ఛాయలు అలముకున్నాయి. కొద్ది రోజులు క్రితమే ఇదే గ్రామానికి చెందిన తల్లి గంగమ్మ, ఆరు నెలల బాబు మృతి చెందిన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనంపై భార్య మృతదేహాన్ని పెట్టుకుని కొంత దూరం ఆపై డోలీపై మోసుకొని తీసుకెళ్లిన తీరు చూపరులను కన్నీళ్లు పెట్టించింది.
ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ : గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే శిఖర గ్రామాల్లో మరణాలు సంభవిస్తున్నాయని ఆదివాసీగిరిజన సంఘం నేతలు వాపోయారు. దీనికి తోడు గ్రామంలో వైద్య సేవలు సరిగా అందడం లేదని ఆరోపిస్తున్నారు. గ్రామానికి ఒక్కసారి కూడా వైద్యులు రాలేదని చెపుతున్నారు. కింద స్థాయి సిబ్బంది అప్పుడప్పుడు వస్తన్నా ఫలితం ఉండడం లేదని వాపోయారు. ఈ మరణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది.