Third Island is Ready For Tourists in Laknavaram Lake Telangana : చుట్టూ పవళ్లు తొక్కుతున్న చల్లని నీళ్లు మధ్యలో అందమైన నిర్మాణంలో బస.. ఊహించుకుంటేనే ఆ అనుభూతి ఎంతో అద్భుతంగా ఉంది కదూ! ఆ ఊహను నిజం చేసేలా, ఆ అనుభూతిని అందిపుచ్చుకునేలా పర్యాటకులకు స్వర్గధామంలా లక్నవరం జలాశయంలోని మూడో ద్వీపం ముస్తాబైంది. ఇప్పటికే సహజసిద్ధమైన అందాలతో వీక్షకులను ఓలలాడిస్తున్న ఈ పర్యాటక ప్రాంతానికి ఇది మరో కలికితురాయి కానుంది.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం జలాశయంలో సుమారు ఎనిమిదెకరాల విస్తీర్ణంలో మూడో ద్వీపాన్ని (ఐలాండ్) టీఎస్‌టీడీసీ (TSTDC : Telangana State Tourism Development Corporation), ఫ్రీ కోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. పర్యాటకుల ఆహ్లాదానికి మొదటి ప్రాధాన్యమిస్తూ పచ్చని ఉద్యానవనాలను తీర్చిదిద్దారు. ఈ ద్వీపంలో మొత్తం 22 కాటేజీలున్నాయి. వాటిలో నాలుగింటిని కుటుంబ సభ్యులతో బస చేసేందుకు వీలుగా తీర్చిదిద్దారు.
ఐదు ఈత కొలనుల్లో నాలుగింటిని వ్యక్తిగత కాటేజీలకు అనుబంధంగా నిర్మించారు. పిల్లల కోసం ప్రత్యేకమైన ఆట వస్తువులు, ఈతకొలను అందుబాటులో ఉంచారు. పెద్దల కోసం రెస్టారెంటు, రెండు స్పాలు తదితర వసతులు కల్పించారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన మాల్దీవులు, శిమ్లా, మున్నార్ వంటి ప్రాంతాలను తలపించేలా ఈ ద్వీపాన్ని సుందరీకరించామని సిబ్బంది తెలిపారు. ఇందులో ఫ్రీ కోట్స్‌కు చెందిన దాదాపు 40 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీన్ని త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి తేనున్నారు.
Boat Facility Starting at Ramappa, Pakala, Laknavaram : సముద్ర తీరాలు, సరస్సుల వద్ద పర్యాటకులు పడవలో ప్రయాణించాలని ఎంతగానో మురిసిపోతుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రామప్ప, పాకాల, లక్నవరం సరస్సుల్లో పర్యాటక శాఖ బోటులో ప్రయాణించే సౌకర్యం కల్పించింది. ఓరుగల్లు నగరంలో తొలిసారిగా పడవ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భద్రకాళి సరస్సులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోటు సేవలు అందుబాటులోకి తేనున్నారు. 30 మంది ప్రయాణించేందుకు బోటు సిద్ధం చేశారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీ తెలిపారు.
"కళ్ల ముందే బాహుబలి మంచుకొండలు'' - అరకు కాఫీ తాగుతూ నేరుగా ఆ అందాలను వీక్షించాల్సిందే!