Eenadu Group Chairman Ramoji Rao Passed Away : అక్షరయోధుడు రామోజీరావు అస్తమయంపై, తెలుగు రాష్ట్రాల ప్రజలు విచారం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ఆయన చేసిన అపార సేవలను గుర్తుచేసుకున్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన క్యాంప్ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి, పూలమాల వేసి నివాళులర్పించారు. జర్నలిజంలో రామోజీరావు, ఉన్నత విలువలు నెలకొల్పారని కొనియాడారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ అమరవీరుల స్థూపం వద్ద అక్షర యోధుడు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జర్నలిస్టు సంఘాల నాయకులు నివాళులర్పించారు. యాదగిరిగుట్టలో రామోజీరావు చిత్రపటానికి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నివాళులర్పించారు. తెలుగు పాత్రికేయ రంగానికి తీరని లోటుగా అభివర్ణించారు. మోత్కూరు మండల కేంద్రంలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటు : ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు అక్షరయోధుడికి నివాళి అర్పించారు. నిర్మల్ జిల్లా భైంసాలో పాత్రికేయులు మహానీయుడి తెలుగు జర్నలిజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. రామోజీరావు మరణం పత్రిక రంగానికి తీరని లోటని ఆదిలాబాద్ జర్నలిస్టు ఐక్య కార్యాచరణ సమితి నాయకులు పేర్కొన్నారు. స్టానిక ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సంతాప సభలో రామోజీరావు తెలుగురాష్ట్రాలకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రిలోని తెలుగుదేశం కార్యాలయంలో కార్యకర్తలు నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా మల్యాలలో పలువురు ప్రజా ప్రతినిధులు, యువకులు రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. కమాన్‌పూర్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు, బీసీ సంఘం నాయకులు రామోజీరావు మృతి పట్ల నివాళులర్పించి సంతాపం తెలిపారు.
Ramoji Rao is No More : సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఈనాడు పాఠకులు, రామోజీరావు అభిమానులు శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాగర్‌కర్నూల్‌లోని అంబేద్కర్ కూడలిలో పలువురు జర్నలిస్టులు రామోజీరావు చిత్రపటానికి అంజలి ఘటించారు. హనుమకొండలోని ప్రెస్‌క్లబ్‌లో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పాత్రికేయులతో కలిసి రామోజీరావుకు నివాళులర్పించారు.
అక్షరయోధుడికి అశ్రునివాళి : పెద్దపల్లిలోని తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ నేతలు రామోజీరావుకు ఘన నివాళులు అర్పించారు. భువనగిరి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ సహా ఇతర పాలకవర్గం సభ్యులు రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి తీరని లోటని జగిత్యాల జిల్లా మల్యాలలోని పలువురు ప్రజా ప్రతినిధులు యువకులు కొనియాడారు.
మల్యాల మండల కేంద్రంలో ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. భద్రాచలంలోని మానవసేవ వృద్ధాశ్రమవాసులు రామోజీరావు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. రూ.80 లక్షలతో ఆశ్రమానికి సకల హంగులతో శాశ్వత భవనం నిర్మించి ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. గతంలో ఇరుకైన గదుల్లో రేకుల షెడ్డులో నడుస్తుండగా, తమ కష్టాలు చూసి చలించి పక్కా భవనం సమకూర్చారని కొనియాడారు.