Telugu Language Day Celebrations Kalamalla YSR District : 'దేశ భాషలందు తెలుగు లెస్సా' అన్నారు శ్రీకృష్ణదేవరాయులు. అలాంటి తియ్యనైన అమ్మ భాషకు గుర్తింపు తెచ్చిన రేనాటి చోళరాజుల తొలి తెలుగు శాసనం వైఎస్సార్ జిల్లా కలమల్లలో ఉంది. ఆ ప్రాంతంలోనే నేడు తెలుగుభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుండటంపై సాహితీవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.
తెలుగు అక్షరాలతో ముద్రించిన శాసనాలు : వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామం. ఈ గ్రామానికి ప్రత్యేక ప్రాశస్త్యం ఉంది. తెలుగుభాష పురుడు పోసుకోవడానికి గుర్తింపు తెచ్చిన తొలి తెలుగు శాసనం ఇక్కడే ఉంది. స్థానిక చెన్నకేశవస్వామి ఆలయంలో రెండు శిలలపైన తెలుగు అక్షరాలతో ముద్రించిన శాసనాలు దర్శనమిస్తాయి. ఈ శాసనాలను రేనాటి చోళరాజు ఎరికల్ ముత్తురాజు బిరుదాంకితుడైన ధనుంజయుడు తెలుగుపై మక్కువతో ఇక్కడ వేయించారు. క్రీ.శ 575లో ఈ శాసనాన్ని వేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. 1905లో మొదటిసారి ఈ శాసనాల వివరాలు సేకరించారు. స్థానిక సాహితీవేత్తలు, పురావస్తుశాఖ అధికారులు అధ్యయనం చేసి కలమల్ల గ్రామంలో ఉన్నదే తొలి తెలుగు శాసనమని గుర్తించారు.
5వ తరగతి పాఠ్యాంశంలోనూ ప్రస్తావన : కేంద్ర యువ సాహిత్య అకాడమీ రచయిత వేంపల్లి గంగాధర్ కలమల్ల శాసనంపై పదేళ్ల కిందట తొలిసారి పుస్తకం విడుదల చేశారు. శాసనంలో తెలుగు అక్షరాలు 17 వరసల వరకు కనిపిస్తాయి. నాటి రాజు కలమల్ల ఆలయానికి భూమిని దానంగా ఇచ్చిన సమయంలో వేయించిన దాన శాసనంగా సాహితీ వేత్తలు చెబుతున్నారు. ఈ కలమల్ల తొలి తెలుగు శాసనం గురించి ప్రస్తుతం 5వ తరగతి తెలుగు పాఠ్యాంశంలోనూ ప్రస్తావించారు. కలమల్లలో లభించిన తొలి తెలుగు శాసనానికి గుర్తింపు తెచ్చే విధంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ చొరవ తీసుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంపై సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Telugu Language Day Wishes: 'తెలుగు భాషను, తెలుగు జాతిని కాపాడుకుందాం'
హాజరుకానున్న మాజీ ఉపరాష్ట్రపతి : కలమల్లలో అధికారికంగా నిర్వహిస్తున్న తెలుగుభాషా దినోత్సవానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కలమల్లలో తెలుగు భాషా దినోత్సవం పండుగలా చేయడానికి నిర్ణయం తీసుకోవడంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలమల్లలో తెలుగు శాసనాలు పాడవకుండా ప్రత్యేక దిమ్మెలను ఏర్పాటు చేస్తున్నారు. తొలి తెలుగు శాసనం ప్రతిని కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయంలోనూ అందుబాటులో ఉంచాలని సాహితీ వేత్తలు కోరుతున్నారు.