Cruise Ships on Somasila to Srisailam in Krishna River : పక్షులు, వన్యమృగాలతో జీవ వైవిధ్యానికి నెలవుగా అలరారుతున్న నల్లమల ఫారెస్ట్‌లో జల పర్యాటకం సరికొత్త రూపు సంతరించుకునేదిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల నుంచి ఏపీలోని శ్రీశైలం వరకు సంవత్సరం పొడవునా కృష్ణా నదిపై క్రూయిజ్ షిప్‌లలో టూరిస్ట్‌లో షికారు చేసేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. మరో వైపు స్పీడ్ బోట్లు కేరళలోని అలప్పుజ, జమ్మూకశ్మీర్ శ్రీనగర్‌లోని దాల్ లేక్‌లో తరహాలోని హౌస్‌బోట్ల సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తోంది.
పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్త పాలసీ : కృష్ణా నదిలో నీళ్లు సమృద్ధిగా ఉండటంతో సోమశిల నుంచి శ్రీశైలం వరకు, నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు క్రూయిజ్ షిప్ టూర్‌ని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ శనివారం ప్రారంభించింది. సోమశిల నుంచి శ్రీశైలం వరకు 120 కి.మీ. దూరం కాగా 6.30 గంటల టైం పట్టింది. ఈ జర్నీలో అబ్బురపరిచే దృశ్యాలెన్నో ఉన్నాయి. ప్రతి శనివారం ప్రారంభమయ్యే టూర్, నదిలో నీటి మట్టం ఆధారంగా ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందని టూరిజం కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. ఆ రాష్ట్రంలో పర్యాటకాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కార్ కొత్త పాలసీని తీసుకువస్తోంది.
నాగార్జునసాగర్-శ్రీశైలం బోటు షికారు ప్రారంభం - ప్యాకేజి వివరాలివే
ఏడాది పొడవునా క్రూయిజ్ షిప్‌లు : ఇందులో భాగంగా అనేక అనుకూలతలు ఉన్న నల్లమల అటవీప్రాంతంలో భాగమైన ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా నదిలో జల పర్యాటకంపై అధికారులు దృష్టిపెట్టారు. సోమశిలలో స్నానఘట్టాల వరకు ప్రెజెంట్ నీళ్లు నిండుగా ఉన్నాయి. మార్చి నుంచి నదిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది. జూన్ వరకు కిలోమీటర్ మేర నీళ్లు ఉండకపోవచ్చు. అంత దూరం సిమెంటు ర్యాంప్ నిర్మించి, నీళ్లున్నంత వరకు వెహికల్లో పర్యాటకుల్ని తీసుకెళ్లే ప్లాన్ ఉంది. ఇది కార్యరూపం దాల్చాక ఏడాది పొడవునా సోమశిల-శ్రీశైలం మధ్య క్రూయిజ్ షిప్‌లు తిరిగేందుకు ఛాన్స్ ఉంది. సిమెంటు ర్యాంపు కట్టడంపై మార్చిలో కార్యాచరణ మొదలవుతుందని పర్యాటక సంస్థ అదనపు జనరల్ మేనేజర్ ఇబ్రహీం ‘ఈటీవీ భారత్’కు తెలిపారు.
స్పీడ్ బోట్ల కొనుగోలుకు సిద్ధం : ప్రస్తుతం కార్తికమాసం కావడంతో శ్రీశైలానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. వసతి గదుల సమస్య కూడా ఉంది. దీంతో పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రెజెంట్ ఈ టూర్‌ను సోమశిల నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంకు క్రూయిజ్ షిప్ జర్నీకి పరిమితం చేసింది. కార్తికమాసం పూర్తయ్యాక హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో బస్సుల్లో సోమశిల, నాగార్జునసాగర్ తీసుకెళ్లడం, తిరుగు ప్రయాణంలో శ్రీశైలం నుంచి తీసుకురావడంతో పాటు అక్కడ అకామిడేషన్ వంటి సౌకర్యాల్ని కల్పించనున్నట్లు సంస్థ అధికారి సాయిరాం తెలిపారు. మరోవైపు సోమశిల నుంచి శ్రీశైలం వరకు నలుగురు వ్యక్తులు ప్రయాణించేలా స్పీడ్ బోట్ల కొనుగోలుకు పర్యాటకాభివృద్ధి సంస్థ సిద్ధమవుతోంది. 20 సిట్టింగ్‌తో కూడిన డీలక్స్ బోట్‌ను కొనుగోలు చేయనుంది.
నది మీదుగా పెద్దపులుల రాకపోకలు : నదికి ఓ వైపు తెలంగాణలో అమ్రాబాద్ పెద్దపులుల అభయారణ్యం, మరోవైపు ఏపీలోని నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు. వీటిలో ఉండే పెద్దపులులు ఈదుతూ రివర్‌ను దాటుతాయి. వాటర్ లెవల్ అధికంగా ఉన్నప్పుడు మినహా ఇతర సమయాల్లో పెద్దపులులు నది మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి.
కొండల మధ్య జలాశయం - బ్రహ్మసాగర్ అందాలను చూసి తీరాల్సిందే!
పర్యాటకులకు గుడ్‌న్యూస్ - పాపికొండలు విహార యాత్ర షురూ - "ఆ ఒక్కటి' తప్పదంటున్న అధికారులు