Telangana Minister Konda Surekha on Bicycle : తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఎప్పుడూ తనదైన శైలిలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆమె సైకిల్ ఎక్కి, సరదాగా సవారీ చేస్తూ కనిపించారు. అయితే ఇది ఉదయం ఎక్సర్సైజ్ కోసం చేసే సైక్లింగ్ కాదు. పాఠశాల విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు చేసిన సైకిల్ రైడింగ్. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇవాళ తన భర్త కొండా మురళి జన్మదినోత్సవం సందర్భంగా పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా వరంగల్‌లోని స్థానిక బట్టల బజార్‌లోని ఆంధ్ర బాలిక ప్రభుత్వోన్నత స్కూల్‌కి సురేఖ వెళ్లారు. అక్కడ విద్యార్థునులకు మంత్రి కొండా సురేఖ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులను చూసి తనకు సైకిల్ తొక్కాలని అనిపించింది కాబోలు, వెంటనే బాలికలతో కలిసి కొద్ది సేపు సైకిల్ తొక్కి విద్యార్థులను ఉత్సాహపరిచారు. బాలికలతో పోటీగా సైకిల్ నడిపి ఔరా అనిపించారు తెలంగాణ మంత్రి సురేఖ. విద్యార్థినులు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు.