Telangana High Court Verdict on MLA Disqualification Petition : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, 10వ షెడ్యూల్, అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది.
బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి వివేకానంద్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ ముందుంచాలని, విచారణకు తేదీలు నిర్ణయించి 4 వారాల్లో రిజిస్ట్రీకి సమాచారం ఇవ్వాలని సింగిల్ బెంచ్ సెప్టెంబర్ 9వ తేదీన తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి సీజే ధర్మాసనంలో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధె, జస్టిస్ జె.శ్రీనివాస్ రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోపోతే హైకోర్టు జోక్యం చేసుకునే అధికారం ఉంటుందని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదన వినిపించారు.
తగిన నిర్ణయం తీసుకోవాలి : స్పీకర్ స్వయంప్రతిపత్తి కలిగి ఉంటారని ఆయన నిర్ణయం తీసుకోకముందే హైకోర్టు జోక్యం చేసుకోరాదని అసెంబ్లీ కార్యదర్శి తరఫున అడ్వకేట్ జనరల్, పార్టీ మారిన ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ మేరకు ఇరువైపుల న్యాయవాదులు సుప్రీంకోర్టు తీర్పులతో పాటు పలు హైకోర్టులకు సంబంధించిన తీర్పులను ప్రస్తావించారు. ఇరువైపుల ఇది వరకే వాదనలు ముగియడంతో సీజే ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఈ రోజు వెలువరించిన తీర్పులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలంటూ అందిన ఫిర్యాదులపై తగిన నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌కు సూచిస్తూ పిటిషన్‌లపై విచారణ ముగించింది.