Telangana High Court Serious On Hydra Actions : ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకువచ్చిన జీవో 99 చట్ట బద్ధతను సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్‌రాంగూడకు చెందిన డి.లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో 19.27 ఎకరాల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. వ్యవసాయ పరికరాలు, కూలీల విశ్రాంతి కోసం నిర్మించుకున్న నిర్మాణాలను ఈ నెల 3న హైడ్రా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పోలీసు బలగాలతో వచ్చి కూల్చి వేసిందన్నారు.
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నప్పటికీ పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా జీవో 99 తీసుకువచ్చిందని, ఇలాంటి ఉత్తర్వులు చట్టాలకు లోబడే ఉండాలన్నారు. చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే పరిపాలనా పరమైన అధికారాలు చెల్లవన్నారు. జీవో 99 ద్వారా జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు అప్పగించిందని, ఇది జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధమన్నారు.
హైడ్రాకు ఉన్న చట్టబద్ధతపై వివరణ ఇవ్వండి : ఒక చట్టం కింద ఏర్పాటైన సంస్థకే అధికారాలుంటాయని, మరో సంస్థకు బదలాయించాలంటే చట్టబద్ధమైన ప్రక్రియ అనుసరించాల్సి ఉందన్నారు. ఏ చట్టం కింద హైడ్రాకు అపరిమిత అధికారాలను అప్పగించిందో తెలియడం లేదన్నారు. అఖిల భారత సర్వీసు ఉద్యోగి, కార్యదర్శి హోదా కంటే తక్కువ కాని అధికారి హైడ్రాకు నేతృత్వం వహిస్తారని జీవోలో పేర్కొన్నప్పటికీ, దానికి విరుద్ధంగా బాధ్యతలు అప్పగించారన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం హైడ్రాకు ఉన్న చట్టబద్ధతపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేసింది.
మరో కేసులో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని 9 ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్, కాంపౌండ్‌ను హైడ్రా కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమా మహేశ్వరమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పట్టా భూమిలో ఉన్న షెడ్లను ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ సెప్టెంబరు 8న హైడ్రా అధికారులు కూల్చి వేశారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి కాంపౌండ్ నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించారు. 1970 నాటి చెరువుకు సంబంధించిన మ్యాపు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ, నీటి పారుదల శాఖ, జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను అక్టోబరు 3వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.