YS Bhaskar Reddy and Uday Kumar Reddy bail petition: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ ఐపీఎస్ స్థాయి అధికారులనే ప్రభావితం చేయగల నిందితులకు సామాన్యులైన సాక్షులు ఓ లెక్క కాదంటూ తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. వైఎస్ భాస్కర్‌రెడ్డి వంటి పలుకుబడి గల నిందితులు బయట ఉంటే సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రారని భవిష్యత్తులో కింది కోర్టు విచారణ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చని పేర్కొంది.
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరికి వ్యతిరేకంగా పోలీసు, ఏపీ ప్రభుత్వ వ్యవస్థలు పని చేస్తున్నాయని సీబీఐ గుర్తు చేసింది. ప్రస్తుతం అభియోగాల నమోదు ప్రక్రియ నడుస్తోందని, నిందితులు విచారణకు ఆటంకాలు సృష్టిస్తున్నారని, ఈ దశలో బెయిలిస్తే పారదర్శక విచారణకు అడ్డంకులు తప్పవని సీబీఐ స్పష్టం చేసింది. వివేకా హత్య కేసులో 6వ, 7వ నిందితులైన గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి ఇరు పక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేశారు.
వివేకా హత్య ఘటనాస్థలంలో సాక్ష్యాల చెరిపివేతలో నిందితులు కీలకపాత్ర పోషించారని సీబీఐ తరఫు న్యాయవాది అనిల్ తల్వార్ వాదించారు. సీబీఐ కోర్టులో విచారణ సాగకుండా జాప్యానికి ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. ఇదే కేసులో ఐదో నిందితుడైన శివశంకర్‌రెడ్డికి బెయిల్ ఇచ్చారన్న కారణంతో నిందితులు ఉదయ్‌కుమార్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి బెయిల్ కోరడం సరికాదని చెప్పారు. హత్యలో శివశంకర్‌రెడ్డి పాత్రకు, భాస్కర్‌రెడ్డి పాత్రకు పొంతన లేదని భాస్కర్‌రెడ్డి పాత్ర కీలకమైందని తేల్చి చెప్పారు. కుట్రలో ఆయన భాగస్వామని సాక్ష్యాల చెరిపివేతలోనూ కీలకంగా వ్యవహరించారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. శివశంకర్‌రెడ్డి 2021లో అరెస్టు కాగా, భాస్కర్‌రెడ్డి అరెస్టై ఏడాదైనా కాలేదన్నారు. పలుకుబడి ఉన్న భాస్కర్‌రెడ్డితో సాక్షులకు ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కుట్రలో ఉద్దేశాలను పరిగణనలోకి తీసుకోవాలని, భాస్కర్‌రెడ్డికి రాజకీయ దురుద్దేశాలతో పాటు కుటుంబ వివాదాలున్నాయని వాదించారు.
భాస్కర్‌రెడ్డి బెయిల్ మంజూరు చేయడానికి అనారోగ్యం కారణం కాదని న్యాయవాది తల్వార్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. కింది కోర్టులో మధ్యంతర బెయిల్ పొంది చికిత్స పొంది, మెడికల్ రికార్డులు సృష్టించారన్నారు. మధ్యంతర బెయిల్ ముగిశాక డిసెంబర్ నుంచి మార్చి వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రాలేదని, ఒకవేళ వచ్చినా జైలులో వైద్య సేవలు లభిస్తాయని తెలిపారు. బెయిల్ ఇవ్వడానికి అనారోగ్యం కారణం కాదని వాదించారు. అప్రూవర్ దస్తగిరిని నిందితుల తరఫు వ్యక్తులు బెదిరిస్తున్నారని, ఇప్పటికే అతనికి వ్యతిరేకంగా ఐదారు కేసులు పెట్టారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
గంగిరెడ్డి ఆధారాలు తుడుస్తుంటే అవినాష్ చూస్తూ నిలబడ్డారు - రవీంద్రనాథ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు - MLA Ravindranath on Viveka Case
వివేకా హత్యను గుండెపోటుగా మార్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం గూగుల్ టేక్‌ఔట్‌లో నిందితుల పాత్రపై సాంకేతిక ఆధారాలున్నాయని, వివేకా హత్య తర్వాత సునీల్ యాదవ్ ఉదయం 1.58కి భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేక్ ఔట్‌లో తేలిందన్నారు. మరో పిటిషనర్ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉదయం 6.53 నుంచి 8.07 గంటల వరకు భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల ఇంట్లో ఉన్నారని, వివేకా హత్యపై ప్రపంచానికి తెలియక ముందే ఉదయ్‌కుమార్‌రెడ్డి, తన తల్లితో చెప్పినట్లు సాక్ష్యముందన్నారు. హత్య గురించి తెలిసిన వెంటనే జమ్మలమడుగు కార్యక్రమానికి వెళ్తూ తిరిగి వచ్చినట్లు అవినాష్ చెబుతున్న దాంట్లోనూ వాస్తవం లేదని తెలిపారు. అక్కడ అలాంటి కార్యక్రమమేదీ లేదని సాక్షి వాంగ్మూలముంది అని కోర్టు దృష్టికి తెచ్చారు.
వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డికి సుప్రీం నోటీసులు - viveka murder case
గతంలో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను ఇదే హైకోర్టు కొట్టి వేసిందని, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేదని వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది నళిన్‌కుమార్ తెలిపారు. సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దు కోరవచ్చన్న నిందితుల తరఫు న్యాయవాది అభ్యర్థనను ఈ కోర్టు తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించారు. సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు, బెదిరించగల పలుకుబడి ఈ నిందుతులకు ఉందని హైకోర్టు గతంలో తీర్పులో పేర్కొందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గంగాధర్‌రెడ్డి, ఎం.వి. కృష్ణారెడ్డి, అప్పటి సీఐ శంకరయ్యలు ఎలా ప్రభావితమయ్యారో తెలిసిందేనన్నారు. పైగా కృష్ణారెడ్డి సీబీఐ అధికారి పైనే ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో కేసు పెట్టారని గుర్తు చేశారు.
పిటిషనర్లు భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిల తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో దస్తగిరి వాంగ్మూలం తప్ప మరో చట్టబద్ధమైన ఆధారం సీబీఐ వద్ద లేదన్నారు. హత్య చేసిన దస్తగిరికి జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించి, ఎక్కడికి వెళ్లినా ఏర్పాట్లు చేస్తున్నారని, సీబీఐ కారణంగా అతడు ప్రముఖుడైపోయారన్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని, కేవలం ఇంటిని వదిలి తిరిగారన్న కారణంగా నిందితుడిగా చేర్చారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.
ప్రచారంలో దూసుకుపోతున్న షర్మిల - మద్దతు కూడగడుతున్న సునీత - Sunita Reddy is meets YCP leaders