Latest Update on Mahalakshmi Scheme: తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద అతి త్వరలోనే నెలకు 2వేల 500 రూపాయలు ఇవ్వనున్నట్లు బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రకటించిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే కొన్ని పథకాలను అమలులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిశాక మరికొన్ని హామీలను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పలువురు మంత్రులు ఇప్పటికే చెప్పగా.. ఈ క్రమంలోనే.. మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
ఆ నెలలోనే ప్రారంభం: లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వనున్నట్లు మంత్రి ప్రభాకర్ తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు రూ.2500 అందుతాయన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని అన్నారు. ఇదిలా ఉంటే ఎటువంటి పింఛన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెలకు రూ.2500 అందేలా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా జులై నుంచి దీన్ని ప్రారంభించబోతున్నారని టాక్ నడుస్తుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పెన్షన్లు ఇవ్వడంతోపాటు ప్రస్తుతం ఉన్న పింఛన్లను రూ.4వేలకు పెంచనున్నట్లు, కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ప్రకటించారు.
డేటా ఆధారంగా: అభయహస్తం ప్రజాపాలన పేరుతో ఊరూరా కార్యక్రమం నిర్వహించి పేదలకు సంబంధించిన డేటాను తీసుకున్నారు. దీని ఆధారంగా 6 గ్యారెంటీల అమలుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకునే పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. అలాగే మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుతోపాటు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. మార్చి ఒకటోతేదీ నుంచి ప్రజలకు ఇవి అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5 లక్షల రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. తాజాగా మహాలక్ష్మి పథకం అమలుపై దృష్టిసారించారు.