Telangana CS Shanti Kumari Review on Hydra : ఓఆర్ఆర్ పరిధిలో జలాశయాలు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాల తొలగింపు ప్రక్రియ పూర్తిగా హైడ్రా పరిధిలోకి తీసుకు రానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నోటీసులు కూడా హైడ్రానే జారీ చేసేలా విధి విధానాలు తయారు చేయాలని పురపాలక శాఖను సీఎస్ ఆదేశించారు. హైడ్రాను బలోపేతం చేసేందుకు పోలీసులు, ఇతర సిబ్బందిని త్వరలో కేటాయించనున్నట్లు సీఎస్ తెలిపారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా పాటించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు.
హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాకు మరిన్ని అధికారాలను, సిబ్బందిని అప్పగించేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. కూల్చివేతలపై రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్, తదితర వేర్వేరు శాఖలు నోటీసులు ఇవ్వడంతో గందరగోళం తలెత్తుతోందని సీఎస్ పేర్కొన్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధివిధానాలను రూపొందించాలన్నారు.
ఎఫ్టీఎల్, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యత హైడ్రాదే : ఎఫ్టీఎల్, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పూర్తిగా హైడ్రాకు అప్పగిస్తామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ప్రస్తుతం జలమండలి పరిధిలో ఉన్న గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ బాధ్యత కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో ఏర్పాటైన 72 బృందాలను మరింత బలోపేతం చేయడానికి పోలీసు, సర్వే, ఇరిగేషన్ తదితర శాఖలకు అవసరమైన సిబ్బందిని కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, శాంతి భద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్, పురపాలక, నీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్, రాహుల్ బొజ్జా, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, ఏసీబీ డైరెక్టర్ తరణ్ జోషి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.