Telangana Cabinet Approval For Rythu Runa Mafi : గత ఐదేళ్లుగా పంట రుణాలు తీసుకున్న రైతులకు రాష్ట్ర మంత్రివర్గం శుభవార్త తెలిపింది. రూ.2 లక్షల వరకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైతు రుణమాఫీ చేయనున్నట్లు 2022 మే 6న కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేసి తీరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రకటించడంతో పాటు పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు. రుణమాఫీకి నిధుల సమీకరణ, విధివిధానాలు, అర్హతలపై కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులు, బ్యాంకర్లు, నిపుణులతో చర్చలు జరిపారు. శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గంలో వివిధ అంశాలు చర్చించి 2018 డిసెంబరు 12 నుంచి గతేడాది డిసెంబరు 9 వరకు తీసుకున్న రుణాలను రద్దు చేయాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు.
Cabinet Approvals 2024 in Telangana : రుణమాఫీ అర్హతలు, విధి విధానాలపై నేడో, రేపో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. రైతు సంక్షేమం కోసం రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం పదేళ్లుగా రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని, తమ ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే మాట నిలబెట్టుకుందని ముఖ్యమంత్రి అన్నారు. అటు రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఉపసంఘం నివేదికపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
TG Cabinet Meeting 2024 : ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో గందరగోళం తలెత్తకుండా మీడియాకు వివరాలు, వివరణలు ఇచ్చే బాధ్యతలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అప్పగించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.
"ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. రుణమాఫీతో 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. రైతు భరోసా అమలుపై మంత్రివర్గ ఉపసంఘం వేశాం. జులై 15లోపు మంత్రివర్గం ఉపసంఘం నివేదిక ఇస్తుంది. ఉపసంఘం నివేదిక ఆధారంగా రైతుభరోసా విధి విధానాలు ఖరారు చేస్తాం. ప్రభుత్వ విధానాలపై శ్రీధర్ బాబు, పొంగులేటి సమాచారం అందిస్తారు. వారు ఇచ్చే సమాచారమే అధికారిక సమాచారం. త్వరలో రుణమాఫీపై జీవో ఇస్తాం. జీవోలో అన్ని వివరాలు ఉంటాయి." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
మూడో గ్యారంటీపై సర్కార్ ఫోకస్ - రూ.2 లక్షల రుణమాఫీపై కసరత్తు షురూ