TDP Strong Counter To YS Jagan Tweet On EVM Machines : ఎన్నికల వ్యవస్థను కించపరిచేలా ఈవీఎంలపై జగన్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలు బ్రహ్మాండమని చెప్పిన జగన్ ఇప్పుడు వాటి పనితీరును శంకించడం వివాదాస్పదంగా మారింది. అప్పటి మాటలన్నీ ఆయన మరిచిపోయారు. ఏమాత్రం మొహమాటం లేకుండా జగన్ నాలుక మడతెట్టేశారు. ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తంచేశారు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రజాస్వామ్యం బలంగా ఉన్నట్లు కనిపించాలని హితోక్తులు వల్లె వేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బ్యాలెట్ వాడుతున్నారని ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేలా మనమూ ఆ దిశగా పయనించాలని రాసుకొచ్చారు.
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ- అమరావతిలో జనసేనానికి ఘన స్వాగతం
ఈవీఎంలపై అనుమానం వ్యక్తంచేస్తూ జగన్ ట్వీట్ : ఐదేళ్ల క్రితం ఈవీఎంలు, వీవీప్యాట్లు, అందులో వచ్చే స్లిప్పులు, వాటిపై కనిపించే గుర్తులంటూ గొప్ప గొప్ప సూక్తులు చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకిలా మాట మార్చారు? ఎందుకంటే 2024 ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ దారుణ పరాభవంతో నిస్తేజమైన వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఎలా సర్దిచెప్పాలో తెలియక ఈవీఎంలపై సాకులతో ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ తెలుగుదేశం నేతలు : ఈవీఎంల పనితీరుపై జగన్ వక్రభాష్యాన్ని అధికార తెలుగుదేశం నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్యం అంటే జగన్‌కు అలర్జీ అంటూ మంత్రి లోకేష్ మండిపడ్డారు. ప్రజల హక్కుల్ని పరిరక్షించే సంస్థలు, వ్యవస్థలను నాశనం చేసిన జగన్ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలు గొప్పగా పనిచేశాయన్న జగన్ 2024లో ఓడిపోగానే ఈవీఎంలను నిందిస్తారా అని ప్రశ్నించారు. వైసీపీను ప్రజలు పూర్తిగా తిరస్కరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్‌ను ఎప్పుడు తిరిగిస్తున్నావ్ జగన్ అంటూ నిలదీశారు. పేదల మనిషినని చెప్పుకొంటూ వందల కోట్లతో రుషికొండపై ప్యాలెస్ ఎలా కట్టుకున్నారో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రజల మూకుమ్మడి తిరస్కరణతో ఘోరంగా ఓడిన జగన్ ఆ నెపాన్ని ఈవీఎంలపై నెట్టేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు.
ఓటమి షాక్ నుంచి జగన్ ఇంకా తేరుకోలేదని నేతల ధ్వజం : రోజురోజుకూ జగన్ అపరచితుడిని మించిపోతున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. వైసీపీ గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేసినట్లు ఓడిపోతే పనిచేయనట్లా అని నిలదీశారు. ప్రజాతీర్పును అవమానించేలా జగన్ వ్యవహరించడం దారుణమని మరో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. జగన్ తీరు "ఏపీ ఎలన్ మస్క్"లా ఉందని ధ్వజమెత్తారు. గెలిస్తే తన గొప్ప ఓడితే ఈవీఎంల తప్పా? అని ప్రశ్నించారు. జగన్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి పులివెందులలో బ్యాలెట్ ద్వారా ఉపఎన్నికను ఎదుర్కోవాలని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. అప్పుడు ఎవరి సంగతేంటో తేలుతుందన్నారు.
బాబాయి, అబ్బాయిలకు సిక్కోలు వాసుల నీరాజనం - Atchannaidu Ram Mohan Naidu