TDP Pattabhi Ram on Sandhya Aqua Bus: కాకినాడ జిల్లాలో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్సు కంపెనీకి చెందిన బస్సును పోలీసులు సీబీఐకి ఎందుకు అప్పగించలేదని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. ఎస్‌ఈజెడ్ కాలనీ వద్ద సంధ్య ఆక్వా బస్సు నాలుగు రోజులుగా ఆగిపోయిందని, తనిఖీలు చేస్తే అందులో హార్డ్‌డిస్క్‌లు, కంప్యూటర్లు ఉన్నాయని తేలిందని తెలిపారు. తనిఖీ చేసి సీబీఐకి అప్పగించకుండా కంపెనీవాళ్లకే అప్పచెబుతారా అంటూ ప్రశ్నించారు. బస్సును తనిఖీ చేసి ఆ కంపెనీ వాళ్లకే పోలీసులు ఎందుకు అప్పజెప్పారని నిలదీశారు.
బస్సులో ఉన్న వస్తువులను సీబీఐకి అప్పగించలేదంటే ఏమనాలి అని మండిపడ్డారు. ఇంత పెద్ద వ్యవహారం బయటపడ్డాక ఇంత ఉదాసీనతా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తారని ముందే తెలుసు అని, అందుకే హార్డ్‌డిస్క్‌లు, రికార్డులన్నీ బస్సులో ఉంచి పక్కన పెట్టారని ఆరోపించారు.
సీబీఐకి అడ్డుతగలాలని పోలీసులకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయా అంటూ ప్రశ్నించారు. సీబీఐకి కనపడకుండా ఎలా దాచిపెట్టాలో కూడా కంపెనీకి పోలీసులు చెప్పినట్లుందని, బస్సులో దొరికిన వస్తువులను సీబీఐకి ఎందుకు అప్పగించలేదో తెలియాలి అని డిమాండ్ చేశారు. సీబీఐకి ఆధారాలు లభించకుండా చేయడంలో ఆంతర్యమేంటన్న పట్టాభి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే అంతా జరుగుతోందని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలను మాత్రం పోలీసులు చక్కగా పాటిస్తారని, బస్సులో దొరికిన డాక్యుమెంట్లను తిరిగి కంపెనీకి ఎందుకు ఇచ్చినట్లని ప్రశ్నించారు.
అలా ఎలా వదిలేశారు ? - సంధ్య ఆక్వా బస్సు విషయంలో అనేక అనుమానాలు - Sandhya Aqua Bus Incident
"పోలీసులు వచ్చి సంధ్య ఆక్వా బస్సును ఓపెన్ చేసి చూశారు. అందులో అనేక రకాల ఫైల్స్, హార్డ్‌డిస్క్‌లు, బ్యాంక్ చెక్‌బుక్‌లు ఉన్నాయి. అయితే వాటిని ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సీబీఐకి పోలీసులు అప్పజెప్పాల్సిందిపోయి, ఆ పరిశ్రమకు చెందిన వారిని పిలిచి అప్పజెప్పారు అంట. సీబీఐ వాళ్లు వస్తున్నారని తెలిసి, ముందుగానే అన్ని రికార్డులు బస్సులో లోడ్ చేసి సంధ్య ఆక్వా పరిశ్రమ వాళ్లు బయటకు పంపించేశారు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ క్లియర్‌గా తెలుస్తోంది, పోలీసులకు అర్ధం కావడం లేదా. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారు". - పట్టాభి రామ్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి
కాగా ఈ నెల 16వ తేదీన విశాఖ పోర్టుకు బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్‌లో భారీగా డ్రగ్స్ నిల్వలు ఉండటాన్ని గుర్తించిన సీబీఐ అధికారులు వాటిని సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందినదిగా నిర్ధరించిన విషయం తెలిసిందే. అదే సంస్థకు చెందిన బస్సు గత మూడు రోజులుగా కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్ కాలనీలో ఉండటం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి బస్సులో తనిఖీలు చేశారు. ఆ తర్వాత సంధ్య ఆక్వా కంపెనీకి బస్సును అప్పగించారు.