TDP MLA Yeluri Sambasiva Rao Petition: ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం పర్చూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (Yeluri Sambasiva Rao) హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సోమవారం ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరపనుంది. గ్రానైట్ ఫ్యాక్టరీల తనిఖీ చేయకుండా తమ విధులకు ఆటంకం కలిగించారని, దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో గనులు, భూగర్భశాఖ (జిల్లా నిఘా విభాగం, నెల్లూరు) సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ ఈ ఏడాది జనవరి 30వ తేదీన ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు ఆధారంగా ఫ్యాక్టరీ యజమాని, ఆయన అనుచరులతో పాటు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (ఎ-8) తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తప్పుడు కేసులో ఇరికించారు: తనను తప్పుడు కేసులో ఇరికించారని, ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కోరారు. ప్రాథమిక విచారణ జరపకుండా పోలీసులు నేరుగా తనపై కేసు నమోదు చేశారని విమర్శించారు. రాజకీయ కారణాలతో తప్పుడు కేసులో ఇరికించారన్నారు. పోలీసులు పెట్టిన సెక్షన్లు అన్నీ ఏడు సంవత్సరాల లోపు జైలు శిక్షకు వీలున్నవి అన్నారు. అర్నెష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ కేసులో 41ఏ నోటీసు జారీ చేయాల్సి ఉంటుందన్నారు.
పర్చూరు ఎమ్మెల్యేపై నల్లధనం కేసు - వైసీపీ కుట్ర అంటున్న టీడీపీ
అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి: ఈ నెల 5వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని సాంబశివరావు తెలిపారు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరు కావాల్సి ఉందని అన్నారు. ప్రస్తుత కేసు మునుగులో తనను అరెస్టు చేయాలని పోలీసులు చూస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉన్నా, ఈ కేసులో కొంతమంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారన్నారు. సెక్షన్లు అన్నీ ఏడేళ్ల లోపు జైలు శిక్షకు వీలున్నవైనప్పటికీ మెజిస్ట్రేట్ యాంత్రికంగా వారికి రిమాండ్ విధించారని అన్నారు. దీనినిబట్టి చూస్తుంటే పోలీసుల వ్యవహార శైలి అర్థం చేసుకోవచ్చన్నారు.
పోలీసుల సస్పెన్షన్ కూడా కారణం: పర్చూరు నియోజకవర్గం పరిధిలో తప్పుడు మార్గంలో ఓట్ల తొలగింపు కోసం గంపగుత్తంగా ఫారం-7 దాఖలు చేసిన విషయమై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశానని ఏలూరి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది పోలీసులు సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. దీంతో తనను వేధించడం కోసం పోలీసులు తనపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరారు.