TDP MLA Payyavula Keshav Election Campaign: గత అయిదేళ్లుగా అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో తీవ్రంగా నెలకొన్న నీటి సమస్యకు ప్రస్తుత పాలకులే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని పాతపేటలో గురువారం సాయంత్రం జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో నిత్యం కుళాయిలకు తాగునీరు వచ్చేవన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పది, పదిహేను రోజులకు ఒకసారి కుళాయిలకు నీరు సరఫరా అవుతున్నాయన్నారు. దీంతో ఉరవకొండ పట్టణంలో ప్రతి కుటుంబం తీవ్ర ఇబ్బందిని ఎదుర్కుంటోందని చెప్పారు. ఈ సమస్యను తాను స్వయంగా జిల్లా కలెక్టర్, ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారుల దృష్టికి పదేపదే తీసుకుని వెళ్లానని తెలిపారు. కానీ నీటి సమస్య మాత్రం అధికారులకు పట్టడం లేదన్నారు.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంటర్నేషనల్ డాన్‌గా మారారు: గండి బాబ్జి - TDP Gandi Babji on drugs Case
ప్రస్తుతం ఆ సమస్య మరింత తీవ్రంగా ఉండగా, మరో 20 రోజుల్లో అది జఠిలంగా మారనుందని తెలిపారు. దీంతో ప్రజలు తాగునీటి విషయంలో మరింత ఇబ్బంది పడనున్నారని అభిప్రాయపడ్డారు. దీనికి ప్రస్తుత పాలకులు బహిరంగ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ చేపడుతున్న ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రచారం ఆశీర్వాద యాత్రను తలపిస్తోందన్నారు.
అడుగడుగునా ప్రజాభిమానం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం ఏడాదికో, ఆరు నెలలకో సంక్షేమం పేరుతో అందిస్తున్న అరకొర సాయాన్ని పక్కన పెట్టి , ఈ ఎన్నికల్లో టీడీపీకి మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పట్టం కట్టాలని కోరారు. ప్రజలకు భారంగా మారిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
"రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు. క్షేత్రస్థాయిలో ప్రజాభిమానం ఎక్కడికి వెళ్లినా వెల్లువెత్తుతోంది. ప్రజలంతా తమ ఆశీస్సులు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఉరవకొండ పట్టణంలో ప్రారంభించిన ప్రచారాన్ని చూస్తుంటే ప్రజా ఆశీర్వాద యాత్రగా అనుపిస్తోంది. పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వ వైఫల్యాలు. గతంలో ప్రతి రోజూ నీళ్లు వచ్చే పరిస్థితి నుంచి ప్రస్తుతం అయిదు రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. రాబోయే 20 రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఉరవకొండ ప్రజలకు ప్రతి రోజూ నీరు అందించగలదు. ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి రోజూ మనం పడే కష్టాలు పోవాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలి. పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోపిడీ చేసే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి". - పయ్యావుల కేశవ్, టీడీపీ ఎమ్మెల్యే