TDP Leader Yanamala Ramakrishna Fire on Jagan : రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప, హత్యలుండవు అనడానికి జగన్ రాజకీయ జీవితమే తాజా ఉదాహరణని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఆస్తుల కోసం తల్లి, చెల్లిని కోర్టుకీడ్చి జగన్ అధఃపాతాళంలో కూరుకుపోయారని వ్యాఖ్యానించారు. ఆయన చేయి పట్టుకున్న వాళ్లంతా పాతాళంలోకే వెళ్లిపోతారని పేర్కొన్నారు. చివరికి జగన్ తన సొంత చెల్లి, తల్లిని కూడా మోసం చేశారని మండిపడ్డారు. ఆయన కుటుంబ తగాదాలను వాళ్లే బజారులో పెట్టి మీడియాపై బురదచల్లడం హాస్యాస్పదమన్నారు. షర్మిలకు పదేళ్లలో రూ.200 కోట్లు ఇచ్చానని చెప్పున్నా జగన్కు ఆ సొమ్ము ఎక్కడివని ప్రశ్నించారు. ఈ విషయంలో ఆదాయపు పన్ను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ శాఖలు ఎందుకు స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక ఆర్ధిక నేరస్తుడు 11ఏళ్లుగా బెయిల్ పై ఉండమేంటని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆయనపై ఉన్న క్విడ్ ప్రోకో కేసులు ఇకనైనా తేల్చాలని డిమాండ్ చేశారని వ్యాఖ్యానించారు. 136 డిశ్చార్జి పిటిషన్లు వేసి కేసుల విచారణ ముందుకు సాగకుండా జగన్ అడ్డుకున్నారని వివరించారు. ఆయన ఓ ఆర్ధిక ఉగ్రవాదిలా దర్యాప్తు సంస్థలకే పెను సవాళ్లు విసరడం భారత శిక్షాస్మృతికే అవమానమని వ్యాఖ్యానించారు. ఇక భవిష్యత్తులో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనుకోవడం పగటికలే అని ఎద్దేవా చేశారు. ఇవాళ కాకపోతే రేపైనా జగన్ జైలుకెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. పాత కేసులకు తోడు అనేక కొత్త కేసులు ఆయన్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో జగన్‌తో ఉండడం ఆత్మహత్యాసదృశ్యమేనని పేర్కొన్నారు. అందుకే చాలా మంది నేతలు అక్కడి నుంచి జారుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
డబ్బు, అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారు- జగన్ సమాజానికి ప్రమాదం: తులసిరెడ్డి