TDP Leader Somireddy Chandra Sekhara Reddy : నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు గోపాలపురం వద్ద సెక్యూరిటీ సిబ్బందికి తెలుగుదేశం పార్టీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అదానీ కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ కొనసాగించేలా పోర్టు సీఈవో జీజేరావు స్పష్టమైన ప్రకటన చేయాలని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కంటైనర్ టెర్మినల్ ఆధారిత పరిశ్రమల ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు సోమిరెడ్డి మద్దతు పలికారు. శాంతియుతంగా చేస్తున్న ధర్నాలో పాల్గొన్న సోమిరెడ్డిని పోర్టు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అడ్డుకోవడం ఏమిటని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమిరెడ్డిని అడ్డుకోవడంతో తెలుగుదేశం నేతలు అక్కడకు చేరుకున్నారు. దీంతో టీడీపీ నేతలకు ఆందోళనాకారులు, పోర్టు సెక్యూరిటీ మధ్య తోపులాట జరిగింది. కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది.
కృష్ణపట్నం పోర్టుకు ఖాళీ కంటైనర్ల వెజల్ తీసుకువచ్చి డ్రామాలాడుతున్నారు- టీడీపీ నేత సోమిరెడ్డి
జీజే రావు సమాధానం చెప్పేంత వరకూ కదలం : 15 రోజుల గడువు అడిగిన సీఈవో జీజే రావు ఇంకో 15 రోజులు గడిచిన స్పందించలేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించ్చారు. అందుకే రోడ్లపై ఉద్యోగులు ధర్నా చేయాల్సి వస్తోందని అన్నారు. సీఈఓ జీజే రావు ఏం సమాధానం చెప్తాడని అన్నారు. జీజే రావు సమాధానం చెప్పేంత వరకు ఇక్కడి నుంచి కదలబోమని ఆయన బీష్మించుకుని కూర్చున్నారు.
మా ప్రభంజనాన్ని మీరు ఆపగలరా? : రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్డుపై మీ పెత్తనం ఏమిటని పోర్టు సెక్యూరిటీ సిబ్బందిపై నిప్పులు చెరిగారు. కృష్ణపట్నం పోర్టు ఏపీ మారీ టైం బోర్డు యాజమాన్యంలో ఉందని, 'ఇదేమైనా మీ అబ్బ జాగీరా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా తాము పోరాటం చేయదలుచుకుంటే 'మా ప్రభంజనాన్ని మీరు ఆపగలరా?' అంటూ సోమిరెడ్డి సవాల్ విసిరారు.
కృష్ణపట్నం పోర్టు తరలింపుపై కార్మికుల ఆందోళన
ఏం సమాధానం చెప్తారు? : విశాఖ పోర్టులో 49 కంటైనర్ వెస్సెల్స్ కాకినాడ పోర్టులో 19 కంటైనర్ వెస్సెల్స్ చివరకు కాటుపల్లిలో 21 కంటైనర్ వెస్సెల్స్ మార్చిలో షెడ్యూల్ ప్రకటిస్తే కృష్ణపట్నం పోర్టులో మాత్రం జీరో వెస్సెల్స్ షెడ్యూల్ ఉందని ఆధారాలతో సహా సోమిరెడ్డి చూపించారు. 100 ఖాళీ కంటైనర్లు పోర్టులో దించి ఆర్భాటం చేస్తున్నారని, ఇప్పుడు కళ్ళు కనిపిస్తున్నాయా? ఏం సమాధానం చెప్తారంటూ అధికారులను నిలదీశారు.
సీఎం జగన్ వల్ల కృష్ణపట్నం పోర్టు మనుగడ ప్రశ్నార్థకం: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి