Pattabhi allegations on CM Jagan: జగన్ బస్సుయాత్ర ప్రజాధరణ లేక తుస్సుయాత్రగా మారిందని తెలుగుదేశం నేత పట్టాభి రామ్ విమర్శించారు. రాష్ర్టవ్యాప్తంగా ఈ ఐదేళ్లలో వైకాపా నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని, ఆ వాటా లెక్కలు తేల్చుకోవడానికే ప్రతి జిల్లాలోనూ సీఎం జగన్ బస్సుయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. బొత్స కుటుంబం దోచిందెంత, జగన్‌కు రావాల్సిందెంత అనేది ఇవాళ విజయనగరం జిల్లా పర్యటనలో తేల్చుకుంటారని పట్టాభి అన్నారు.
బొత్స సత్తిబాబు, చిన్న శీను, అప్పల నరసయ్య, అప్పల నాయుడు తదితర నేతలు దోచిన లెక్కలు తేల్చి, తన వాటా వసూలుకే జగన్ రెడ్డి విజయనగరం వచ్చాడని పట్టాభి రామ్ ధ్వజమెత్తారు. వైజాగ్ స్టీల్‌కు క్యాప్టివ్ మైన్ గా ఉన్న గర్భామ్ మాంగనీస్ మైన్‌ను సత్తిబాబు కుటుంబం కబ్జా చేసిందని ఆయన ఆరోపించారు. 2022 అక్టోబర్‌లో గర్భామ్ మంగనీస్ మైన్ లీజును విశాఖ ఉక్కు పరిశ్రమకు ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు. పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సత్తిబాబులు విశాఖ స్టీల్ కు మాంగనీస్ మైన్ లీజును పొడిగించకుండా తొక్కిపెట్టారని మండిపడ్డారు. మైన్ గడువు ముగియడంతో వైజాగ్ స్టీల్ బహిరంగ మార్కెట్‌లో మాంగనీస్ టన్ను 14-15 వేలు పెట్టి కొనాల్సి వస్తోందని విశాఖ స్టీల్ వారు మాంగనీస్ మైన్ లీజు రెన్యువల్ చేయాలని 12 లేఖలు రాసినా జగన్ రెడ్డి పట్టించుకోలేదని విమర్శించారు.
జగన్ పాలనలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు - ప్రజలపై రూ.27 వేల కోట్లు భారం: పట్టాభి - PATTABHI FIRES ON CM JAGAN
వైజాగ్ స్టీల్ కు చంపావతి నదిపై ఉన్న సరిపల్లి సాండ్ రీచ్ లీజు గడువును సైతం జగన్ సర్కార్ పొడిగించలేదని దుయ్యబట్టారు. సరిపల్లి సాండ్ రీచ్ నేడు బొత్స బంధిపోటు ముఠా కబ్జాలో ఉందని అన్నారు. విజయనగరం జిల్లాను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్‌కు పెద్ద ఎత్తున కప్పం కడుతున్నందుకే బొత్స కుటుంబంలో అందరికీ సీట్లు దక్కాయని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మైన్‌లను కబ్జా చేసి ఏ ముఖం పెట్టుకుని విశాఖ ఎంపీగా ఝాన్సీ ఓట్లు అడుగుతున్నారని కొమ్మారెడ్డి పట్టాభి రామ్ నిలదీశారు.
జగన్ ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని పట్టాభి రామ్ అన్నారు. వేల కోట్లు దోచుకొని దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ ఇస్తే మొత్తం దోపిడీ చేశారని ఎద్దేవా చేశారు. దోచుకోవడానికి ఏమన్నా మిగిలిందా అని జగన్ తిరుగుతున్నారని పేర్కొన్నారు. విజయనగరంలో దోపిడీ లెక్కలు తేలాలంటే జగన్‌కు సమయం పడుతుందని, అందరిలా కాదు.. బొత్సది ఫ్యామిలీ ప్యాక్ అని, ఇసుకలో, మైనింగ్‌లో ఎంత దోచుకున్నారో అడగడమే జగన్ పని అంటూ ఎద్దేవా చేశారు. దోచిన దాంట్లో ఎంత రావాలనేది తేల్చుకోవడానికే జగన్ బస్సు యాత్ర చేస్తున్నారన్నారు. బొత్స దోచిందెంత.. జగన్‌కు రావాల్సిందెంత ఇవాళ తేల్చుకుంటారని పట్టాభి ఆరోపించారు.