Devineni Uma responded on Jagan comments: సీఎం జగన్ కుప్పం సభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. జగన్ రెడ్డి కుప్పంలో అబద్దాలు, అసత్యాలతో బడాయి ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల స్టంట్‌లో భాగమే కుప్పంలో జగన్ తిప్పలు పడుతున్నారని ఆరోపించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ కు టీడీపీ 87 శాతం పూర్తి చేసిందని పేర్కొన్నారు. మిగిలిన 13 శాతం పనులు చేయడానికి జగన్ రెడ్డికి 57 నెలలు సమయం పట్టిందా అంటూ దేవినేని నిలదీశారు. 3 లిఫ్ట్ లో 2 లిఫ్ట్ లు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన ఒక్క లిఫ్ట్ పూర్తి చేయడానికి జగన్ రెడ్డికి 5 ఏళ్లు సమయం పట్టిందని దేవినేని ఎద్దేవా చేశారు. గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, ఎజెన్సీలను పక్కన పెట్టారని మండిపడ్డారు.
తెలుగుదేశం 5 ఏళ్లల్లో 12వేల కోట్లు ఖర్చు చేసింది: రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం తెలుగుదేశం 5 ఏళ్లల్లో రూ. 12వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ రెడ్డి కేవలం 2వేల కోట్లు ఖర్చు చేశారని ఉమా దుయ్యబట్టారు. హంద్రీ-నీవాలో 672 కిలోమీటర్ల పనులు చేశానని జగన్ రెడ్డి ఎలా మాట్లాడతాడని ప్రశ్నించారు. అవుకు టన్నల్ పనులు పూర్తి చేసి పులివెందులకు నీళ్లిస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారని దేవినేని తెలిపారు. పరదాలు చాటున తిరిగే జగన్ రెడ్డికి చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. పట్టిసీమను పూర్తి స్థాయిలో వాడి ఉంటే హంద్రీ-నీవా ద్వారా కర్నూలు జిల్లా, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరు అందేదని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్‌లను తిట్టడానికే ఇరిగేషన్ మంత్రి ఉన్నారని, దమ్ముంటే ఇరిగేషన్ మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డికి ఇవే చిట్టచివరి ఎన్నికలన్న దేవినేని ఉమా, ఇంతటితో ఆయన రాజకీయ చరిత్ర ముగిసిపోతుందని ధ్వజమెత్తారు.
అన్నొస్తుండంటే ఇవన్నీ పక్కా ఉండాల్సిందే - ప్రజల గురించి ఆయనకు అవసరమే లేదు
బుల్లెట్ దిగుతుందన్న మాజీ మంత్రి అడ్రస్ లేకుండా పోయారు: గత తెలుగుదేశం ప్రభుత్వం 32 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్లు దేవినేని తెలిపారు. ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రాలో ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. పోలవరం డ్యాంను గోదావరిలో ముంచేశాడని విమర్శించారు. సీఎం జగన్‌కు పోలవరంపై మాట్లాడే ధైరం ఉందా అంటూ సవాల్ విసిరారు. దేవుడి స్క్రీప్ట్‌లో భాగంగా పట్టిసీమ పంపులు నడపాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గతంలో బుల్లెట్ దిగుతుందన్న మాజీ మంత్రి అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందని ఇరిగేషన్ మంత్రి అంబటిని అడిగితే దేవుడికి తెలుసు అంటున్నాడని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ 12 స్థానాలు గెలుస్తుంది: జేసీ దివాకర్‌రెడ్డి