TDP Government Improved Facilities For Devotees in Tirumala: తిరుమలకు వచ్చే భక్తులకు గత ఐదేళ్లలో దూరమైన సౌకర్యాలను కొత్త ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. దివ్యదర్శనం టోకెన్లు, క్యూలెన్లు నియంత్రణ, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ తిరిగి ప్రారంభమయ్యాయి. తిరుమలకు వచ్చే భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకుని భక్తి భావంతో తిరుగు ప్రయాణం కావాలన్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా టీటీడీ చర్యలు చేపట్టింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల వెంకన్నను భక్తులకు దూరం చేసే కార్యక్రమాలే ఎక్కువ చేశారన్న ఆరోపణలు మిన్నంటాయి. టీటీడీలో రాజకీయ జోక్యం పెరిగిపోయి ఇష్టానుసారం నిర్ణయాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణ భక్తులకు స్వామి దర్శనం గగనమైపోయింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరడం టీటీడీ ఈవో మార్పుతో తిరుమలలో పాతపద్ధతులు అమల్లోకి వచ్చాయి. ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు వివిధ విభాగాల అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ భక్తులకు అనువైన చర్యలు చేపట్టారు.
ఐదేళ్లుగా మూసివేసిన నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లు, వైకుంఠం క్యూ కాంపెక్ల్స్1లో కంపార్ట్‌మెంట్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో నింపడం ద్వారా అన్నప్రసాదాలు, పాలు, నీళ్లు వంటివి అందజేయడం వ్యయంతో కూడుకున్న పనిగా భావించిన టీటీడీ అధికారులు సర్వదర్శనం, దివ్యదర్శనం భక్తులను కంపార్ట్‌మెంట్లలోకి వదలకుండా క్యూలైన్లలోనే తిప్పుతూ ఆలయానికి చేరుకునేలా చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంపార్ట్‌మెంట్లను పునరుద్ధరించారు. దీంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి తప్పింది.
నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో కంపార్ట్‌మెంట్లు నిండిన తర్వాతే క్యూలైన్లలో బయట భక్తులు వేచి ఉంటున్నారు. వారంతరాలు మినహా ఇప్పుడు భక్తులెవ్వరూ క్యూలైన్లు బయట కనిపించడం లేదు. అలాగే కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, అల్పాహారం వంటివి నిరంతరాయంగా అందచేస్తున్నారు. క్యూలైన్ల దూరం తగ్గడం కంపార్టమెంట్లలో అన్నప్రసాదాలు, అల్పాహారాలు విరివిగా అందుబాటులోకి రావడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా, చిరుత దాడులు సాకు చూపి కొంతకాలం దివ్యదర్శనం టోకెన్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో కాలినడకన వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త ప్రభుత్వం దివ్యదర్శనం టోకెన్లు పాక్షికంగా పునరుద్ధరించడంతోపాటు అక్రమాలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. పాత పద్ధతులన్నీ పునరుద్ధరించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నెరవేరిన ఆకాంక్ష- తిరుమలకు అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్ర - Amaravati Farmers Padayatra