TDP Btech Ravi Comments on YS Jagan: పేదవాడికి, పెత్తందారుకు మధ్య యుద్ధమని గతంలో జగన్ ఊదరగొట్టారని, రాష్ట్రంలో ఉండే పెత్తందారులకు ప్రతినిధిగా ఉన్నదే జగన్ అని పులివెందుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విమర్శించారు. ఎన్నికల అఫిడవిట్‌లో దాదాపు 750 కోట్ల రూపాయలు ఉన్నట్లు జగన్ చూపించారని, కానీ ఆయనపై పోటీ చేస్తున్న తన అఫిడవిట్‌లో రూ.80 లక్షల్లోనే ఉందని తెలిపారు. అఫిడవిట్‌ను చూసైనా పేదవాడెవరు, పెత్తందారు ఎవరో ప్రజలు తెల్చుకోవాలని పేర్కొన్నారు.
పేదవారిని గెలిపించాలని జగన్ పదేపదే చెబుతున్నారని, ఎన్నికల అఫిడవిట్ చూసి జగన్ చెప్పినట్లే పేదవాడిని అయిన తనను గెలిపించండని బీటెక్ రవి కోరారు. జగన్ మోహన్ రెడ్డి ఆఖరికి ఆయన చెల్లెళ్ల చీరల రంగుపైనా మాట్లాడుతున్నారంటే ఏమనాలని మండిపడ్డారు. భారతమ్మ కూడా పచ్చ దుస్తులు ధరిస్తారని, ఆమెనూ అలాగే అంటారా అని ప్రశ్నించారు. వివేక హత్య కేసులో దర్యాప్తు సంస్థలు తేల్చిన అంశాలను జగన్ ఎలా తోసిపుచ్చుతారని ప్రశ్నించారు. జగన్ విధిలేని పరిస్థితుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి ని వెనుకేసుకొస్తున్నారని విమర్శించారు.
చనిపోయిన వ్యక్తి పేరును తన స్వార్థం కోసం వాడుకునే వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. వివేకా రెండో పెళ్లి విషయం పులివెందులలోనే జగన్ ప్రస్తావించారని, ఎన్నికల సమయంలో ఇవాళ కొత్త విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. వివేకా రెండో పెళ్లిపై జగన్ ప్రస్తావించడం దారుణమని బీటెక్ రవి అన్నారు.
పులివెందులకు వచ్చినప్పుడు రెండ్రోజుల ముందు జగన్ నుదుటిపై ప్లాస్టర్ లేదని, రెండు రోజుల తర్వాత ప్లాస్టర్ పెట్టుకుని వచ్చారని ఆరోపించారు. ఇవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. సానుభూతి ఓట్ల కోసం మాత్రమే పులివెందులలో కూడా ప్లాస్టర్ వేసుకుని వచ్చారని విమర్శించారు.
వైఎస్‌కు వ్యతిరేకులైన వారికి మద్దతుగా ఉంటారా అని జగన్ విమర్శించారని, ఏదైనా మాట్లాడేటప్పుడు అన్నీ ఆలోచించి మాట్లాడాలని కోరుతున్నానని బీటెక్ రవి అన్నారు. జగన్ అహంకారానికి, పులివెందుల ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.