SV Ranga Rao Jayanti Celebrations: రాజమహేంద్రవరంలో ఎస్వీ రంగారావు 106వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్, సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ కొండలరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదావరి గట్టున ఉన్న ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహం వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. మంత్రి దుర్గేస్ ఎస్వీఆర్ కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు చిత్రసీమ ఉన్నంతకాలం ఎస్వీఆర్ కీర్తి అజరామరంగా నిలుస్తుందని వక్తలు కొనియాడారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి దుర్గేశ్ జాతీయస్థాయిలో మొదటిసారిగా ఉత్తమ నటుడు అవార్డును అందుకున్న వ్యక్తి ఎస్వీఆర్ అని ఉద్ఘాటించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా తొలిసారిగా మహానటుడి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం వాసిని కావడం తన అదృష్టమని, ఇక్కడి గోదావరి నీటిని తాగడం వల్లే తనకు మంత్రి పదవి వచ్చినట్లు భావిస్తున్నానన్నారు. ఎస్వీఆర్ కుటుంబానికి రాజమహేంద్రవరంతో ఎంతో అనుబంధం ఉందని వివరించారు. నగరానికి చెందిన ఆయన మేనమామ ద్వారానే ఎస్వీఆర్ సినీ రంగ ప్రవేశం చేశారని వెల్లడించారు. 19ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కొండలరావును ఆయన అభినందించారు.
బాలకృష్ణ మాటల్లో వివాదం కనిపించడం లేదు: ఎస్వీ రంగారావు మనవళ్లు
అనంతరం రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ తన తండ్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు అనుచరుడిగా రాజకీయరంగ ప్రవేశం చేసిన కందుల దుర్గేశ్‌కు మంత్రి పదవి వరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఎస్వీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తరువాత అందరినీ కలుపుకుని రాజమహేంద్రవరం నగరాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు.
జక్కంపూడి రాజా, గణేశ్ తనకు కొడుకుల వంటివారని పేర్కొన్నారు. పర్యాటకశాఖ మంత్రిగా రానున్న పుష్కరాల నాటికి గోదావరి తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డీసీసీబీ బ్యాంకు మాజీ ఛైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ఎస్వీ రంగారావు జయంతిని క్రమం తప్పకుండా ప్రతి ఏటా నిర్వహిస్తున్న పంతం కొండలరావును అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు.