Sunkesula-Nagaladinne Damage Road in Kurnool District : 50 కిలోమీటర్లు, 20కిపైగా గ్రామాలు, వేల మంది ప్రజలు రోడ్డెక్కితే ఒళ్లు హూనమే. దారి పొడవునా గుంతలు, పైకి తేలిన కంకర రాళ్లు, దుమ్ము, ధూళి ఇలా ఒకటేంటి అసలు రోడ్డు ఎలా ఉండకూడదో చెప్పడానికి దీన్ని మించిన ఉదాహరణ మరొకటి కనిపించదేమో. స్థానికులే చందాలు వేసుకుని ఒకసారి గోతులు పూడ్చుకున్నా ప్రభుత్వానికి సిగ్గు అనిపించలేదు. అంత కష్టమైతే రోడ్డూ జనమే వేసుకుంటారులే అనే రీతిలో మిన్నకుండిపోయింది.
Kurnool District: కర్నూలు జిల్లా సుంకేసుల నుంచి నాగులదిన్నె మీదుగా మంత్రాలయం వెళ్లే రోడ్డు 50 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం గోతులు, గతుకులే. 2020లో తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కొత్త రోడ్డు వేస్తామంటూ హడావుడిగా పాత రహదారి తవ్వేశారు. నాలుగేళ్లవుతున్నా రోడ్డు వేసిన పాపాన పోలేదు. సుంకేసుల-నాగులదిన్నె మధ్య కొత్తకోట, కె.శింగవరం, ముడుమాల, పలుదొడ్డి, కొండాపురం, గుండ్రేవుల వంటి 20కి పైగా ఊళ్లున్నాయి. రైతులు తమ ఉత్పత్తులు విక్రయించడానికి, విద్యార్థులు పాఠశాలకు, రోగులు ఆసుపత్రుల కోసం కర్నూలు వెళ్లాలంటే ఇదే దారి. కానీ ఈ రోడ్డు ధ్వంసమవడంతో (Damage) ప్రయాణానికిి గంట పట్టే సమయం రెండు గంటలపైనే పడుతోంది.
ఈ రహదారిపై ప్రయాణించి విసుగెత్తిన స్థానిక గ్రామాల ప్రజలు చందాలు వేసుకుని కొంతమేర మట్టితో రోడ్డు చదును చేసుకున్నారు. అది కూడా ప్రస్తుతం పాడై రాళ్లు తేలింది. ముందు వాహనం వెళ్తే వెనుక వెళ్లలేనంతగా దుమ్ములేస్తోంది. దుమ్ము, రహదారి అస్తవ్యస్తం వల్ల శ్వాసకోస, నడుము నొప్పులతో బాధపడుతున్నామని స్థానికులు తెలిపారు. రోజూ ఈ మార్గంలో వెళ్లే డ్రైవర్లు ఈ దారికో దండం అంటున్నారు.
రహదారి నిర్మాణం జరగకపోవటంతో ఆర్టీసీ బస్సులను తగ్గించేసింది. 40 ఏళ్లుగా నడుస్తున్న మంత్రాలయం బస్సు సర్వీస్ నిలిపివేశారు. ప్రస్తుతం గుండ్రేవుల వరకు ఓ బస్సు, విద్యార్థుల కోసం మరో బస్సు తిరుగుతోంది.
"ఇసుక రీచ్‌లకు అనుమతి ఇవ్వటంతో ఈ రహదారిపై లారీలు ప్రయాణించాయి.దీంతో రోడ్డు అస్తవ్యస్తం అయింది. వృద్ధులు, గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 10 నిమిషాల్లో వస్తుందన్న రావడానికి అంబులెన్స్ గంట సమయం పడుతుంది."-స్థానికులు
సి.బెళగల్ మండల పరిధిలో తుంగభద్ర నదిలో 6 ఇసుక రీచ్‌లకు అనుమతిచ్చారు. ఈ రోడ్డుపైనే రోజుకు సుమారు 300 లారీల ఇసుకను తరలించుకుపోతున్నారు. దీంతో స్థానికులు వేసుకున్న రోడ్డు సైతం ధ్వంసమైపోయింది. ఒక్కో ఇసుక లారీ బహిరంగ మార్కెట్లో లక్ష రూపాయలకు విక్రయిస్తున్నారు. అలా నెలకు 90 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా ఈ రోడ్డుకు మాత్రం నిధులు ఇవ్వడం లేదు.
బయటపడిన నాణ్యతా లోపం - జాతీయ రహదారిపై ఏర్పడిన పగుళ్లు - Cracks on National Highway
ఈ రహదారి దుస్థితిపై కొండాపురానికి చెందిన హనుమంతురెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) కూడా వేశారు. ఎన్నికల ముందు హడావిడిగా సుంకేసుల నుంచి తిమ్మందొడ్డి వరకు 17 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి పూనుకున్న ప్రభుత్వం ఎన్నికల కోడ్ రావడంతో ఆపేసింది.
Damage Roads in AP: అధ్వానంగా పల్లె దారులు..వర్షాలకు పూర్తిగా ఛిద్రమై వాహనదారులకు నరకం