Telangana DSC Counseling 2024 : ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైన పని. దీనికోసం ఎంతో కష్టపడితే కానీ ఈ ఉద్యోగం రావడం కష్టం. అలాంటిది కొందరు అర్హత లేకున్నా దొంగదారిలో ఉద్యోగం సాధించాలని చూస్తున్నారు. 1:3 నిష్పత్తిలో అర్హత సాధించిన వారిలో పలువురు అర్హత లేకున్నా ఎకనామికల్లి వీకర్స్ సెక్షన్(EWS) కోటాలో ధ్రువపత్రాలను సమర్పించారు. దీనిని గుర్తించిన ఇతర, తోటి అభ్యర్థులు అభ్యంతరం చేశారు. ఆ తర్వాత అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాంటి వారిని పరిగణనలోకి తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు వేడుకున్నారు.
ఇద్దరు అభ్యర్థుల గుర్తింపు : జిల్లాలోని హవేలీఘనపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలిద్దరూ ఓ ప్రభుత్వ శాఖలో ఉద్యోగులు చేస్తున్నారు. భార్యకు ఎస్జీటీ పోస్టుకు పిలుపు రావడంతో గురువారం విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం సమర్పించింది. వాస్తవానికి భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండటం వల్ల ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రం పొందేందుకు అనర్హులు. వీరిద్దరి ఆదాయం కలిపితే నెలకు రూ.లక్షల్లోనే ఉంటుంది. మరోవైపు కొల్చారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు 1:3 నిష్పత్తిలో పిలుపు వచ్చింది. దీంతో ఆమె సైతం ధ్రువీకరణకు హాజరయ్యారు.
ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి, కానీ తండ్రి పేరిట ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందారు. వివాహం అయ్యాక భర్త పేరిట సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. ఇలా వీళ్లు అర్హత లేకున్న ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం గమనార్హం. అసలు రూ. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న ఓసీలకు రెవెన్యూ అధికారులు ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. దీని ఆధారంగా ఎస్జీటీ పోస్టులకు 1:3 నిష్పత్తిలో పిలుపు అందుకున్న వారిలో ఇద్దరు అభ్యర్థులు అర్హత లేకున్నా ధ్రువీకరణ పత్రం సమర్పించారు. దీనిని మరో ఇద్దరు అభ్యర్థులు గుర్తించారు. 1:3 నిష్పత్తిలో వీరి తర్వాత ర్యాంక్ సాధించిన అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు.
ఈడబ్ల్యూఎస్ కోటాలో 13 పోస్టులకు 39 మంది ఎంపిక : మెదక్ జిల్లాలో 310 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వం ఈనెల 3న డీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. దీంతో ఆయా కేటగిరిలోని పోస్టులకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఆహ్వానించారు. అయితే కేంద్రం ఓసీలకు ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తోంది. ఈ కోటా కింద 13 పోస్టులకు గానూ 1:3 నిష్పత్తిలో 39 మందిని పిలిచారు.
తిరస్కరించామన్న విద్యాధికారి : ఇద్దరు అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్‌కు అర్హత లేకున్నా ధ్రువపత్రాలు సమర్పించారని తమ దృష్టికి వచ్చిందని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. వారి దరఖాస్తులను తిరస్కరించనున్నామని, ఈ విషయమై అదనపు కలెక్టర్‌కు ఫైల్ పెట్టామని వివరించారు.
చర్యలు తీసుకోవాలి : అర్హత లేకున్నా తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థి, 302 ర్యాంక్ నరేశ్ డిమాండ్ చేశారు. వీరివల్ల ఇతర అభ్యర్థులకు అన్యాయం జరగనుందని వాపోయారు. ఈ విషయమై అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసు అధికారుల వద్దకు వెళ్లితే ఫిర్యాదు తీసుకోలేదన్నారు.
న్యాయం చేయాలి : ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎంతో కష్టపడి చదివానని 315వ ర్యాంకర్ నిఖిత అన్నారు. ఈ డబ్ల్యూఎస్ కోటాలో పిలిస్తే వచ్చి ధ్రువపత్రాలు సమర్పించామన్నారు. కానీ మాకన్నా ముందు ర్యాంకులు సాధించిన వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్‌కు అర్హత లేకున్నా అందజేశారని వాపోయారు. దీనిపై పూర్తి ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల - వచ్చే నెల 9న నియామక పత్రాల అందజేత - Telangana DSC Results Released
తెలంగాణ డీఎస్సీ ఫైనల్ 'కీ' విడుదల - చెక్ చేసుకునేందుకు దిగువ లింక్ మీకోసం