1800 Bogus Businesses in Telangana : రాష్ట్రంలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న డీలర్లు 5.33 లక్షల మంది ఉండగా, వారిలో వార్షిక టర్నోవర్ రూ. కోటిన్నర కంటే ఎక్కువ వ్యాపార లావాదేవీలు నిర్వహించే వ్యాపారులు దాదాపు రెండు లక్షలు ఉన్నారు. అందులో కూడా 50 వేల మంది వరకు కేంద్ర జీఎస్టీ పరిధిలో, మిగిలిన దాదాపు లక్షన్నర మంది రాష్ట్ర జీఎస్టీ పరిధిలో ఉన్నారు. మొత్తం జీఎస్టీ రిజిస్ట్రేషన్దారులు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలపై అధికారులు గట్టి నిఘా ఉంచాల్సి ఉంది. అదే విధంగా ఆయా సంస్థలు తీసుకుంటున్న వే బిల్లులు, నెలవారీగా వేస్తున్న వ్యాపార లావాదేవీల రిటర్న్‌లు సక్రమంగా వేస్తున్నాయా లేదా అన్నదానిపై నిఘా ఉంచాలి.
రిటర్న్‌లు వేయని డీలర్లు ఎందుకు వేయలేదో పరిశీలించాల్సి ఉంటుంది. అందుకే అధికారులు వార్షిక వ్యాపార లావాదేవీలు రూ.కోటిన్నర కంటే ఎక్కువ ఏయే సంస్థలు చేస్తున్నాయో వాటిపై సర్కిళ్ల వారీగా గట్టి నిఘా ఉంచాల్సి ఉంది. గడిచిన ఏడెనిమిది నెలలుగా వ్యాపారుల లావాదేవీలపై అధికారులు నిఘా సక్రమంగా పెట్టకపోవడంతో పన్నుల రాబడులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న రిజ్వీ అంశాల వారీగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నతస్థాయి నుంచి కింది స్థాయి సీటీవోల వరకు నిర్దేశిత లక్ష్యాలను ఇస్తున్నారు.
ఆగస్టులో వాణిజ్య పన్నుల రాబడి రూ.6051.04 కోట్లు : లీకేజీలను కట్టడి చేయడంతో పాటు వ్యాపారస్థులపై నిఘా పెంచారు. సకాలంలో రిటర్న్‌లు వేయని డీలర్లను గుర్తించి, రిటర్న్‌లు వేసేట్లు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఆయా వ్యాపార సంస్థల లావాదేవీలపై నిఘా పెరిగి రిటర్న్‌లు సక్రమంగా వేసేట్లు చూడడంతో ఆగస్టు నెలలో వాణిజ్య పన్నుల శాఖ రాబడి 2023 ఆగస్టులో వ్యాట్, జీఎస్టీలతో కలిసి వచ్చిన రూ.5,498.42 కోట్లు వాణిజ్య పన్నుల రాబడి కంటే ఈ ఏడాది ఆగస్టులో రూ.6051.04 కోట్లు వచ్చింది. అంటే రూ.552.62 కోట్లు అదనపు రాబడితో పది శాతానికిపైగా వృద్ధి కనపరిచింది. గతంలో పాలనాపరమైన అంశాల్లో ఏర్పడిన ఇబ్బందులతో ఆదాయం పడిపోయినట్లు ఆ శాఖ చెబుతున్నా, అధికారులు ఆ శాఖ పాలనను గాడిలో పెట్టే పనిని చేపట్టి కొనసాగిస్తున్నారు.
అదేవిధంగా సక్రమంగా రిటర్న్‌లు వేయని, వ్యాపార లావాదేవీలు నిర్వహించని డీలర్లు 1800లకు పైగా ఉన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధమికంగా గుర్తించారు. ఆయా సంస్థలు క్షేత్ర స్థాయిలో ఉన్నాయా లేవా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు వచ్చే నెల 15వ తేదీ వరకు కమిషనర్ రిజ్వి గడువు ఇచ్చినట్లు అధకారులు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు ఏడువందల మంది డీలర్లకు చెందిన వ్యాపార, వాణిజ్య సంస్థలను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఇప్పటి వరకు బోగస్ అని తేలిన దాదాపు వంద సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీలను స్తంభింప చేసినట్లు తెలుస్తోంది.
ఆస్తులు జప్తు చేసేందుకు నోటీసులు? : అదేవిధంగా వ్యాపార లావాదేవీలను నిర్వహించకుండా ఐటీసీ రూపంలో ప్రభుత్వ సొమ్మును ఆయా సంస్థలు స్వాహా చేసినట్లు నిర్ధారణకు వచ్చినట్లయితే, ఆయా సంస్థలు ఎవరెవరి వద్ద నుంచి సరుకు కొనుగోలు చేశారో పరిశీలన చేస్తారు. రిజిస్ట్రేషన్లో పొందుపరిచిన చిరునామాలకు వెళ్లి జీఎస్టీకి చెందిన మొత్తాన్ని స్తంభింపచేశారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన మొత్తం రూ.150 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఐటీసీ రూపంలో ప్రభుత్వ సొమ్మును తీసుకుని ఉంటే ఆస్తులను జప్తు చేసేందుకు నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదే తరహాలో వాణిజ్య పన్నుల శాఖ నిఘా మరింత విస్తృతం చేస్తే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.