Steps to Build ESI Hospital in Guntur : గుంటూరు జిల్లా కార్మికుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఈఎస్ఐ (ESI) ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి కీలక అడుగు పడింది. 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. నిర్మాణం పూర్తయితే వేలాది మంది కార్మికులకు వైద్య సేవలు అందనున్నాయి.
కార్మికుల వైద్య కష్టాలకు చెల్లు : రాష్ట్రంలో మొత్తం ఏడు ఈఎస్ఐ ఆస్పత్రులు నిర్మించాలని 2020లోనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. విజయనగరం, కాకినాడ, విశాఖపట్నం ఆస్పత్రుల నిర్మాణ పనులు ప్రారంభం కాగా గుంటూరు, పెనుకొండ, శ్రీసిటీ, అచ్యుతాపురం ప్రాజెక్టులు భూకేటాయింపుల దశల్లోనే ఉన్నాయి. గత ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ప్రక్రియ స్తంభించింది. గుంటూరు జిల్లాలోని మిర్చి యార్డ్‌తో పాటు స్పిన్నింగ్ మిల్స్, కోకాకోలా, పెప్సీ కంపెనీలతోపాటు అనేక పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరులో ఈఎస్ఐ డిస్పెన్సరీ మాత్రమే ఉండటంతో వైద్య అవసరాల కోసం విజయవాడ గుణదలలో ఉన్న ఈఎస్ఐ కార్యాలయానికి కార్మికులు వెళ్లాల్సి వస్తోంది.
Construction: నెరవేరని ఈఎస్‌ఐ ఆసుపత్రి కల.. ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితం
ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణానికి అడుగులు : గుంటూరులోనే 100 పడకల ఆస్పత్రి నిర్మించి వైద్య కష్టాలు తీర్చాలని గత ప్రభుత్వానికి కార్మిక సంఘాల నేతలు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు కూటమి పాలనలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి భూమి సేకరించాలని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ నిర్ణయించింది. పత్తిపాడు మండలం నడింపాలెంలోసర్వే నంబర్ 110లోని 6.5 ఎకరాల్లో వైద్యశాలను నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో అక్టోబర్ 8న జరిగిన 194వ ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
హర్షం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు : భూసేకరణ పూర్తయ్యాక మూడేళ్లలోనే ఆస్పత్రి నిర్మాణం పూర్తికానుంది. దాదాపు 50 వేల మంది కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈఎస్ఐ ఆస్పత్రితోపాటు పారా మెడికల్, నర్సింగ్ కోర్సులకు కూడా కేంద్రం అనుమతివ్వడంపై వైద్య సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
"గుంటూరు జిల్లాలో ఉన్న వివిధ పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి లేకపోవడంతో కార్మికుల వైద్య అవసరాల కోసం విజయవాడ గుణదలలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యను గుర్తించిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 100 పడకల ఆసుత్రిని గుంటూరులోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వారికి గుంటూరు నగర కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం." - మాల్యాద్రి, ఏఐటీయూసీ నగర ఉపాధ్యక్షుడు
MP GVL: 'వైజాగ్ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి రూ.390 కోట్లు మంజూరు'