Stella L Panama Ship Issue : కాకినాడ తీరంలో లంగరు వేసిన 'స్టెల్లా ఎల్ - పనామా నౌక కదలికపై తర్జన భర్జన కొనసాగుతోంది. నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాలను పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నేడు పరీక్షలు నిర్వహించనున్నారు. తాజా పరిణామాలపై శుక్రవారం ఎగుమతిదారులు కాకినాడలో అంతర్గత సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు.
కాకినాడ ఎంకరేజ్ పోర్టులో రేషన్ బియ్యం ఆనవాళ్లను కలెక్టర్ గుర్తించడం, నౌకను సీజ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించడం, తదనంతర పరిణామాలతో నెలకొన్న ప్రతిష్ఠంభన వీడే అవకాసం కనిపిస్తోంది. నౌకలో సేకరించిన 12 కంపెనీలకు చెందిన బియ్యం నమూనాలు కాకినాడలోని పౌర సరఫరాల శాఖ జిల్లా ప్రయోగశాలలో ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. సాయంత్రానికి ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఫలితాల నివేదికను కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రభుత్వానికి పంపిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. నిల్వలు సీజ్ చేసి నౌకను పంపే అవకాశం కనిపిస్తోందన్న వాదన వినిస్తోంది.
వారం గడచినా పరీక్షలు లేవు - స్టెల్లా ఎల్ షిప్‌పై ఎందుకీ ప్రతిష్టంభన?
భారీగా నష్టం: నౌకలోకి ఎక్కించిన నిల్వలు దింపడం సాధ్యం కాదనే వాదన ఎగుమతిదారుల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వం అక్రమ నిల్వలు స్వాధీనం చేసుకున్న ప్రతిసారీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి బ్యాంకు గ్యారెంటీలతోనో, ప్రత్యేక అనుమతులతోనో విడిపించుకునే ఎగుమతిదారులు ఈసారీ అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఎగుమతిదారులు, కంపెనీలు శుక్రవారం కాకినాడలో అంతర్గత సమావేశం నిర్వహించి తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.
స్టెల్లా నౌక గడువు దాటి 19 రోజులపాటు కాకినాడ తీరంలోనే నిలిచిపోవడంతో నిరీక్షణ రుసుము, డెమరేజ్ ఛార్జ్ రోజుకి 20 లక్షల చొప్పున 3 కోట్ల 80 లక్షల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురైందన్న అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మరింత జాప్యం జరిగితే ఎక్కువ నష్టపోవాల్సి వస్తున్నందున, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే నిర్ణయానికి ఆయా కంపెనీలు వచ్చాయి.
హల్దియా నుంచి కాకినాడ తీరానికి నవంబర్ 11న 'స్టెల్లా ఎల్' నౌక వచ్చింది. కాకినాడ పోర్టు నుంచి పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ ట్రేడ్ సెంటర్ కోటోనౌ పోర్టుకు బియ్యం నిల్వలు ఈ నౌక ద్వారా చేరవేయాల్సి ఉంది. ఇంపీరియల్ ఏజెంట్ ద్వారా నౌకలో 52,200 టన్నుల బియ్యం ఎగుమతి చేసేలా 28 ఎగుమతి సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 32,415 టన్నుల బియ్యాన్ని నౌకలోకి నింపిన తర్వాత కలెక్టర్ తనిఖీ చేసి 640 టన్నుల పేదల బియ్యం ఉన్నట్లు ప్రకటించడంతో నౌక కదలికకు అడ్డంకులు ఎదురయ్యాయి.
కాకినాడ సీపోర్టు కేఎస్ పీఎల్ వద్ద కూడా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎంకరేజ్ పోర్టు వద్ద రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయగా, తాజాగా మరో తనిఖీ కేంద్రం పెట్టినట్లు కలెక్టర్ తెలిపారు. 24 గంటల పాటు ఈ చెక్ పోస్టులు పనిచేస్తాయని రేషన్ బియ్యం పోర్టులోకి ఎగుమతవ్వకుండా నియంత్రించే బాధ్యత చెక్‌పోస్టులదేనని స్పష్టం చేశారు.
అలలపై ఊగిసలాటలా స్టెల్లా నౌక భవితవ్యం - 'సీజ్ ద షిప్' సాధ్యమేనా!