Disabled Students Meet Nara Lokesh : మంత్రి లోకేశ్ చొరవతో జాతీయస్థాయి విద్యా సంస్థలు ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో 25 మంది దివ్యాంగ విద్యార్థులు సీట్లు సాధించారు. ఈ సందర్భంగా వారు ఉండవల్లిలోని నివాసంలో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 25 మందికి సీట్లు వచ్చాయని తెలిసిన రోజున ఆనందంగా నిద్రపోయానని లోకేశ్ తెలిపారు. తన బిడ్డకు అనారోగ్యం వస్తే ఎంత కంగారుపడతానో, దివ్యాంగుల బాధను కూడా అలాగే భావించానని వెల్లడించారు. చదువు పూర్తయ్యాక మళ్లీ అమరావతికి వచ్చి సేవలందించాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు.
విద్యాశాఖను సవాల్‌గా తీసుకున్నా : తాను విద్యాశాఖ తీసుకుంటున్నానంటే మిత్రులు భయపెట్టారని లోకేశ్ పేర్కొన్నారు. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉంటాయని చెప్పారని పేర్కొన్నారు. అలాంటి శాఖ తీసుకుంటే ఇబ్బంది పడతావని వారు చెప్పినట్లు గుర్తు చేశారు. స్టాన్‌ఫోర్డులో చదువుకున్న తానే విద్యాశాఖ తీసుకోవడానికి భయపడితే, ఇక ఎవరు తీసుకుంటారని అనుకున్నట్లు చెప్పారు. అందుకే సవాల్‌గా ఈ బాధ్యతలు స్వీకరించానని లోకేశ్ వెల్లడించారు.
Lokesh Distribute Laptops in Divyang Students : రాష్ట్రంలో యువతకు ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం ద్వారా, పేదరికం లేని ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు. బటన్ నొక్కితే దివ్యాంగుల సర్టిఫికెట్లు నేరుగా వచ్చేలా ఆరు నెలల్లో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమయానికి అందేలా చూస్తామని వివరించారు. విద్యాశాఖలో అంతా గందరగోళంగా ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై అధ్యయనం చేస్తున్నానని, ఐదేళ్లలో పాఠశాలల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యను సత్వరమే పరిష్కరించిన అధికారులను ఆయన అభినందించారు. తమ ప్రభుత్వ విధానమైన సింపుల్ గవర్నమెంట్ -ఎఫెక్టివ్ గవర్నెన్స్‌కి ఇది చక్కని ఉదాహరణ అని లోకేశ్ వివరించారు.
Specially Abled Students Thanks to Lokesh : మంత్రి లోకేశ్ స్పందించిన తీరు, అందిన సహాయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తమకు వ్యవస్థపై నమ్మకం పెరిగిందని వారు చెప్పారు. విద్యార్థుల సమస్యపై ఆయనను కలవాల్సిన పని లేదని, కేవలం మెసేజ్ పెట్టినా చాలని అన్నారు. అందుకే అరగంటలోనే తమ సమస్య పట్ల స్పందించారని గుర్తు చేశారు. అందుకే ఆఘమేఘాలపై జీఓ తెచ్చి తమ బిడ్డల భవిష్యత్ కాపాడారని వివరించారు. లోకేశ్‌ను కలిశాక తమ బిడ్డల ముఖంలో ఆనందం చూశామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో #Thankyounaralokesh హ్యాష్ ట్యాగ్ నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అయింది. 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించిన మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు.
మంత్రి లోకేశ్ చొరవతో ఐఐటీ, ఎన్ఐటీల్లో దివ్యాంగ విద్యార్థులకు ప్రవేశం - Nara Lokesh Quick Response