Cyber Crime Cases in AP: ప్రముఖ వ్యాపారవేత్త నూతన కంపెనీ ప్రారంభిస్తున్నారు, షేర్లు కొనండి అంటూ సామాజిక మాధ్యమాల్లో పబ్లిసిటీ ఇస్తారు. నగదు వసూలు చేశాక నగదు డబుల్ అయినట్లు ఆన్లైన్లో చూపిస్తారు. ఇంతలోనే మొత్తం దోచేస్తారు. ఇలా సైబర్ నేరగాళ్లు ప్రజల అవసరాల్ని అవకాశంగా మార్చుకుని నూతన పంథాలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు.
ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫోన్‌కి "ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేత నూతన కంపెనీ ప్రారంభిస్తున్నాడు, క్రిప్టో కరెన్సీ (Crypto currency) రూపంలో పెట్టుబడులు పెట్టండి" అంటూ మెస్సేజ్ వచ్చింది. నిజమేనని అనుకున్న ఆయన 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అనంతరం నగదు రెట్టింపు అయినట్లు ఆన్లైన్లో చూపారు. నగదు డ్రా చేయాలంటే కొద్ది రోజుల సమయం పడుతుందని సైబర్ నేరగాళ్లు తెలిపారు. దీంతో కొన్నాళ్లు తరువాత నగదు డ్రా చేయాలనుకుంటే ఆన్లైన్లో చూపట్లేదు. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు లబోదిబోమన్నాడు.
రూ.49కే 48 గుడ్లంటూ ఆఫర్- లింక్‌పై క్లిక్ చేస్తే క్షణాల్లో రూ.48వేలు మాయం!
మరోవైపు విజయవాడకు చెందిన మరో మహిళ ఫోన్‌కు కరెంట్ బిల్లు కట్టలేదు, విద్యుత్ సరఫరా నిలిపివేస్తామంటూ మెస్సేజ్ వచ్చింది. విద్యుత్తు బోర్డు అధికారికి కాల్ చేయమంటూ ఓ నెంబరును కూడా ఇచ్చారు. దీంతో ఆ నంబర్‌కు మహిళ కాల్ చేయగా తన వాట్సాప్‌కు ఓ లింక్ పంపించారు. దానిపై క్లిక్ చేసి 10 రూపాయలను జమచేయాలని చెప్పారు. దీనికిముందు స్క్రీన్ షేరింగ్ యాప్ (Screen sharing app) డౌన్‌లోడ్ చేయమని సూచించటంతో ఆమె అలాగే చేశారు.
కేటుగాళ్లు చెప్పినట్లుగా ఆ మహిళ తన బ్యాంకింగ్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి తొలుత రూ.10 చెల్లించింది. ఈ క్రమంలో ఆమె టైప్ చేసిన ఐడీ, పాస్‌వర్డ్‌లను వారు తమ స్క్రీన్‌పై చూసి విడతల వారిగా మహిళ అకౌంట్లో సుమారు రూ.3 లక్షలను మళ్లించారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆమె ఖాతాలో నగదు అంతా ఖాళీ చేశారు.
సైబర్ మోసగాళ్లు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అమాయకులను బోల్తా కొట్టించేందుకు నకిలీ వెబ్ సైట్లు, స్టాక్ మార్కెట్ (Stock market), ఫారెక్స్ వాణిజ్యం అంటూ వచ్చే లింక్‌లపై క్లిక్ చేయకూడదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు, సర్వీసు ప్రొవైడర్ల నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్‌లకు వాటి ఐడీ ఉంటుందని, అలా కాకుండా ఫోన్ నెంబర్ల నుంచి వస్తే అనుమానించాలని చెబుతున్నారు. ఎస్‌ఎంఎస్‌ల్లో వచ్చిన ఏవిధమైన లింక్‌లు, ముఖ్యంగా సంక్షిప్త యూఆర్‌ఎల్‌పై క్లిక్ చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల నుంచి రక్షణ కావాలా? అయితే ఆ 'బీమా' తీసుకోవడం తప్పనిసరి!