Special Financial Assistance to AP in Union Budget 2024: ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం వడివడిగా సాగనుంది. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ ఏడాది రాజధానికి 15వేల కోట్ల రూపాయలు అంందజేయనున్నట్లు ప్రకటించడంతో నిర్మాణ పనులు దూసుకెళ్లనున్నాయి. వైఎస్సార్సీపీ విధ్వంస పాలనతో దారుణంగా దెబ్బతిన్న రాజధానికి నిధుల సమస్యతో సతమతమవుతున్న తరుణంలో కేంద్రం ప్రకటనతో పెద్ద ఉపశమనం లభించింది. తక్షణం రాజధాని పనులు ప్రారంభించేందుకు ఊతం లభించింది.
రూ.15 వేల కోట్ల సాయంతోపాటు అవసరమైతే వివిధ సంస్థల ద్వారా మరిన్ని నిధులు సమకూరుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్ర యంత్రాంగం తక్షణం స్పందించి కేంద్ర ప్రభుత్వంతో, రుణ సంస్థలతోనూ సంప్రదింపులు జరిపి నిధులు తెచ్చుకోవడమే తరువాయి. వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తే ఒక్క ఏడాదిలోనే రాజధాని రూపరేఖలు మార్చేయవచ్చు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ మరిన్ని నిధులు తెచ్చుకోగలిగితే ఆంధ్రుల కలల రాజధాని సాకరమైనట్లేనని రాజధాని వాసులు అంటున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అడవిలా మారిన అమరావతిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం తొలి ప్రాధాన్యమని చెప్పకనే చెప్పింది. రహదారుల నిర్మాణం, 80శాతం పైగా పూర్తయిన భవనాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు సమీకరణ కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్న తరుణంలో కేంద్రం ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. మరింత వేగంగా రాజధాని నిర్మాణం ముందుకు తీసుకెళ్లనుంది.
రాజధానికి రూ. 15 వేల కోట్లు అప్పా? లేక గ్రాంటా? - నిర్మలా సీతారామన్ స్పష్టత - Budget 2024 for AP
అమరావతిలో ప్రధాన పనులతో పాటు భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వడానికి రూ.50వేల కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అంచనా వేసింది. రూ.41వేల కోట్లకు టెండర్లు పిలవడమేగాక 5వేల కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తిచేసింది. గుత్తేదారులకు రూ.1,300 కోట్లు బకాయిలు ఉన్నా పనులు చేసేందుకు వారు సిద్ధంగానే ఉన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించడం ద్వారా వారికి వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం రాజధానిలో ముళ్లచెట్లన్నీ తొలగించడానికి రెండునెలలు సమయం పట్టనుంది. నిలిచిన పనులకు మళ్లీ డీపీఆర్‌లు సిద్ధం చేయడం, అంచనాలు సవరించడానికి మరో నాలుగు నెలలు పట్టనుంది.
రాజధానిలో రహదారులు, వంతెనలు, వరదనీరు, మురుగు నీటిపారుదల వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌ల అభివృద్ధి, కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం, విద్యుత్ సదుపాయాలు వంటి మౌలిక వసతులకు రూ.17 వేలకోట్లు ఖర్చవుతందని అంచనా వేశారు. వాటిలో మూడున్నరవేల కోట్ల విలువైన పనులు చేశారు. ఐకానిక్ టవర్లు, నివాస సముదాయాలకు రూ.8,700 కోట్లు ఖర్చుకానుండగా ఇప్పటికే రూ.1,505 కోట్ల పనులు పూర్తయ్యాయి.
రైతులకు ఇచ్చే లేఅవుట్లలో మౌలిక వసతులకు రూ.20వేల కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేయగా ఇప్పుడు అంచనాలు పెరగనున్నాయి. కేంద్రం అందించే సాయంతో రాజధానిలోని ప్రధాన మౌలిక వసతుల పనుల్ని, పరిపాలన నగరంలో భవనాల్ని దాదాపుగా ఒక కొలిక్కి తేవచ్చు. దీంతో రాజధానిలో భూములు తీసుకున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కూడా నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.15వేల కోట్ల రుణాన్ని అంతర్జాతీయ బ్యాంకుల నుంచి ఇప్పించనుంది. అది రుణమైనా రాష్ట్రానికి భారం కాదు. పైగా ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు ఇచ్చే రుణంపై వడ్డీ నామమాత్రంగా ఉంటుంది. తిరిగి చెల్లింపు ప్రారంభ గడువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత ఈ రూ.15వేల కోట్లు తీర్చడం రాష్ట్రానికి పెద్ద భారం కాకపోవచ్చు. ఈ రుణాలకు కేంద్రమే హామీ ఇస్తుంది కాబట్టి ఎఫ్ఆర్బీఎమ్ పరిధిలోకి కూడా రాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
అమరావతికి కేంద్ర సాయం - ఆంధ్రప్రదేశ్ నేతల హర్షం - tdp leaders on union budget 2024